ఆంజ‌నేయం: హనుమంతుని విగ్రహాలు ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా..?

Kavya Nekkanti

హనుమంతుడిని సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కొలిచిన వారికి కొంగు బంగారమై నిలిచిన వాడు హనుమంతుడు. ఏ పేరుతో పిలిచినా పలికే హనుమంతుడి భక్తులు చాలా ఎక్కువే అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక తన ఇష్టాన్ని, తన ప్రేమని, తన భక్తిని, తను అమితంగా ఆరాధించే ఆరాధ్య దైవాన్ని హృదయంలో నిలుపుకున్న అమిత పరాక్రమవంతుడు ఆంజనేయస్వామి. అందుకే హనుమంతుడికి ఉన్న భక్తి పారవశ్యం ఎవరిలోనూ చూడలేం.

 

ఆంజనేయుడిని ఎక్కువగా పూజించడానికి ముఖ్య కారణం.. అతని నిజాయితీ, మానవత్వం, బలం, జ్ఞానం, నిజమైన భక్తిని కలిగి ఉండటమే. ఇక రామాయణంలో హనుమంతుడు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అస‌లు హనుమ లేని రామాయణం పరిపూర్ణం కాదు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. హనుమంతుని విగ్రహాలు ఎరుపు రంగులో ఎక్కువగా కనిపిస్తాయి. మ‌రి ఇందుకు కార‌ణంగా ఏంటి..? అన్న‌ది ఎప్పుడైనా ఆలోచించారా..? వాస్త‌వానికి ఎక్కువగా హనుమంతుని విగ్రహం పచ్చగా కానీ ఎరుపు రంగులో కానీ ఉంటుంది. పచ్చ రంగు అతని సహజం. అయితే సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది. దీనికి ప్రధాన కారణం , హనుమంతుడు సింధూర వర్ణములో తనను తాను మార్చుకున్నాడు.

 

ఆ వివ‌రాలు చూస్తే.. ఒకరోజు హనుమంతుడు, సీతా దేవి తన నుదిటిపై సింధూరం ధరించడం చూసి, ఆమెను ఎందుకు సింధూరం వినియోగించారు అని ప్రశ్నించినప్పుడు, ఆమె రాముని పై తన ప్రేమకు గౌరవ సూచకంగా రాసుకున్నట్లు వివరించింది. దీంతో రాముని పై తన భక్తిని నిరూపించడానికి, హనుమంతుడు తన శరీరం మొత్తాన్ని సింధూరంతో కప్పాడు. ఇది తెలుసుకున్న తరువాత, రాముడు హనుమంతునికి ఒక వరం ఇచ్చాడు. భవిష్యత్తులో తనను ఆరాధించే వారు.. వారి వ్యక్తిగత ఇబ్బందులు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడాన్ని చూస్తారని అంటారు. అందుకే హనుమంతుని విగ్రహాలు ఎరుపు రంగులోనే ఎక్కువ‌గా ఉంటాయి.

 
  
  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: