తొలి ఏకాదశి : నేడే తొలి ఏకాదశి...... ఈరోజు పాటించాల్సిన విధివిధానాలివే....?
ప్రజలు ఏదైనా మంచిపనిని ప్రారంభించాలని అనుకుంటే ఏకాదశి, దశమి రోజుల్లో మాత్రమే ప్రారంభిస్తారు. సంవత్సరం పొడుగునా ఉండే ఏకాదశుల్లో ఆషాడ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ప్రాచీన కాలంలో తొలి ఏకాదశి రోజును సంవత్సర ఆరంభంగా భావించేవారు. ప్రధమైకాదశి అనే సంసృత నామాన్ని బట్టి తెలుగువాళ్లు ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని చెబుతున్నారు. ఈ ఒక్క ఏకాదశి గురించి గొప్పగా చెప్పడానికి పలు కారణాలు ఉన్నాయి.
సంవత్సరానికి ఆయనములు రెండు. ఉత్తరాయణ పుణ్యకాలంతో పోలిస్తే దక్షిణాయణ పుణ్యకాలంలో పండుగలు ఎక్కువగా వస్తాయి. ఈ కాలంలో ఆరోగ్యం కోసం నియమాలు ఎక్కువగా పాటించాల్సి ఉంటుంది కాబట్టి పెద్దవాళ్లు అనేక వ్రతాలు పెట్టారు. ఏకాదశి నుంచే పండుగల ప్రారంభం జరుగుతుంది. బ్రహ్మవైవర్త పురాణంలో తొలి ఏకాదశి పండుగ గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. ఎంతో విశిష్టమైన ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఎంతో ప్రియమైనది.
అందువల్ల ఈరోజు హరిశయనోత్సవం అని కూడా అంటారు. ప్రతినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. తొలి ఏకాదశి రోజున ఒంటిపూట భోజనం చేసి, శేషసాయి అయిన లక్ష్మీ నారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుంది. నేడు సూర్యోదయానికి ముందే లేచి, స్నానమాచరించి స్వామివారిని నిష్టతో పూజించాలి.
పూజగదిని శుభ్రం చేసి విష్ణుమూర్తి పటానికి పసుపుకుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. స్వామికు చక్కెరపొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతులివ్వాలి. ఈరోజు పగటిపూట శయనించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. నేడు విష్ణుమూర్తి మేలుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. క్షీరసముద్రంలో విష్ణుమూర్తి శయనించటం వల్ల ఈ పండుగను హరిశయనైకాదశి లేదా శయనైకాదశి అని కూడా పిలుస్తారు.