తపస్సు వలన కలిగే ప్రయోజనం ఏమిటి...?
ఇందుకు ఉదాహరణగా.. ఓ ఆయుధాన్ని చాలాకాలం వాడకుండా ఓ మూల పడేస్తే, అది తుప్పుపట్టి పనికిరాకుండా పోతుంది. కానీ దాన్ని నిరంతరం వాడుతూంటే పదునుదేలి.. దాని పనితనాన్ని చూపిస్తుంది. అలాగే మనస్సు కూడా. అయితే., ఇక్కడ అందరికి మరో సందేహం రావచ్చు. ‘మనస్సు నిరంతరం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది కదా! మరి తపస్సు ఎలా అవుతుంది’ అని ప్రశ్న మదిలో కచ్చితంగా పుట్టుకొస్తుంది. అప్పుడు ఓ విషయాన్ని గ్రహించాల్సి వుంటుంది. ఆలోచించడం వేరు, ఆరాటపడడం వేరు. ఏదో ఒక విషయం గురించి ఆలోచించడాన్ని.., ఆరాటపడడం అనరు. చంచలమైన మనస్సును నియంత్రించి, ఒక నిర్దిష్ఠమైన లక్ష్యాన్ని దానికి నిర్దేశించి., ఆ దిశగా మనసును మళ్ళించడానికి పడే ఆరాటాన్నే.. ‘తపస్సు’ అంటారు. అది మంచి అయితే మంచి ఫలితాన్ని.., చెడు అయితే చెడు ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. అందుచేతనే తపస్సు చేసే సాధకుడు మంచినే ఆశించి., విశ్వశాంతిని కాంక్షిస్తూ తపస్సు చేయాలి. అదే నిజమైన తపస్సు. ఇందుకు ప్రకృతి పరమైన ఆధారం కూడా వుంది. అదే.. సృష్టిలో అందమైన కీటకం ‘సీతాకోకచిలుక’.
సాధారణంగా ఒక ప్రాణి నుంచి అదే విధమైన ప్రాణి పుడుతుంది. కానీ.. సీతాకోకచిలుక పెట్టే గ్రుడ్ల నుంచి సీతాకోకచిలుకలు రాకపోగా గొంగళిపురుగులు వస్తాయి. అవి చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాయి. ఆ దశలో అది రాళ్ళలో, రప్పల్లో, తిరుగుతూ... ఆకులు తింటూ కాలం గడుపుతుది. కొంత కాలం గడిచాక తన జీవితం మీద రోత కలిగి... ఆహార, విహారాలు త్యజించి, ఎవ్వరికీ కనిపించని ప్రదేశనికి వెళ్లిపోయి., తన చుట్టూ ఓ గూడు నిర్మించుకుని, తపస్సమాధి స్థితిలోకి వెళ్లిపోతుంది. అలా కొంతకాలం గడిచాక, దాని తపస్సు ఫలించాక అది తన గూడు చీల్చుకుని బయటకు వస్తుంది. అప్పుడది గొంగళిపురుగులా కాకుండా అందమైన సీతాకోకచిలుకలా వస్తుంది. ఆకులు, అలములు తినకుండా. పూవుల్లో ఉండే మకరందాన్నే తాగుతుంది. ప్రకృతి ధర్మానికి కట్టుబడి గ్రుడ్లు పెట్టిన మరుక్షణం ఈ సంసార జగత్తులో చిక్కుకోక మరణిస్తుంది. అదీ తపస్సు ఇచ్చే ప్రతిఫలం. అలాగే తపస్సిద్ధి పొందిన మానవుడు ఈ సంసార లంపటంలో చిక్కుకోకుండా భగవన్నామామృత పానంతో తరిస్తాడు.