దుర్యోయోధనుని ఈర్ష్య అసూయల నుంచి జనించిందే ద్రౌపది నవ్వు! నిజంగా అసహజం, కల్పితం?
ఈ మధ్య కాలంలో వస్తున్న మహాభారతాల్లో “ద్రౌపది నవ్వు” విచిత్రంగా, వింతగా, అపహాస్యంగా మారి అసలు కురుక్షెత్రానికి కీలక మలుపుగా మార్చి చెప్పబడింది. అందరూ అనుకుంటున్నట్టు, మయసభలో సుయోధన పరాభవం నిజమేనా? అది అర్ధ సత్యమా? అసత్యమా? అసలు ద్రౌపది నిజంగా నవ్విందా?
భారతంలోని వర్ణనలను బట్టి చూస్తే ద్రౌపది జన్మమూ, ఆమె జన్మత్పూర్వ కథా క్రమణిక, ఆమె సౌందర్యమూ, వివాహ ప్రహసనం, దాంపత్యం జీవనం, అన్నీ అసాధారణమైన విషయాలూ. ఉహాతీతమే కాదు లోకాతీతమైనవీ కూడా!
యజ్ఞవేదిక నుంచి ‘యాఙ్ఞసేని’ గా ఆమె ఆవిర్భావంలోని సంభవమా? అసంభవమా? అనే విషయాలను ఒక పక్కకు నెట్టి పరిశీలిస్తే, అలా ఆమె జన్మించిందని చెప్పడంలో వ్యాస మహర్షి అంతర్యం ఆమె “కారణ జన్మురాలు” అని తెలియజేయటమే.
"కులపవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణయు
త్పలసుగంధి, లసన్మహోత్పలపత్రనేత్ర యరాళకుం
తల విభాసిని, దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి
తజ్జ్వలన కుండము నందు బుట్టెప్రసన్నమూర్తి ముదంబుతోన్"
వంశ పావని, నల్లకలువ వంటి కోమలమైన శరీర వర్ణం కలది కృష్ణ (మహాభారతంలొ కృష్ణ పాత్రలు నాలుగు. ఒకరు యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు, మరొకరు ధనుర్ధారి అర్జునుడు, ఇంకొకరు బ్రహ్మర్షి కృష్ణ ధ్వైపాయనుడు, నాలుగవ వారు యాఙ్ఞసేని ద్రౌపది) కలువ పరిమళన్ని వ్యాపింపజేది, మిలమిల మెరిసే కలువరేకుల వంటి కన్నులు గలది, వంపులున్న శిరోజాలతో పరిఢవిల్లే సొగసరి, దివ్యతేజస్సును వెదజల్లేది, మనోహర రూపిణి అయిన ఒక కన్యామణి అగ్నికుండం నుండి జనించింది అందరికి అనందం కలిగించింది. పాండవధర్మపత్నిగా జీవితం సాగించింది.
"అతి రూపవతీ భార్యా, శతౄః" అన్న నానుడి నిజం చేస్తూ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది."అఖిల లావణ్య పుంజంబు నబ్జభవుడు మెలతగా దీని యందు నిర్మించె నొక్కొ కానినా డిట్టి కాంతి యే కాంత లందు నేల లేదని సామర్ష హృదయలయిరి"
బ్రహ్మదేవుడు సమస్త సౌందర్య కాంతి సమూహాన్ని ఈ ద్రౌపదీ కాంతగా నిర్మించినట్లున్నాడు. అందువల్లనే కాబోలు, ఇంతటి కాంతి ఏ యితర కాంత ల్లోను కానరాదు- అని అక్కడి వాళ్లంతా అసూయ చెందారు. సాటి స్త్రీలే అసూయ పడేటంత లావణ్యవతి ద్రౌపది.
రాజసూయంలో నాడు జరిగిన అన్నదానం చిరస్మరణీయం. ఆ అన్నదాన కార్యనిర్వాహకురాలుగా నాడు ద్రౌపది వెలిగిన వెలుగు, కనుల ముందు నడయాడిన మెరుపు దుర్యోధనునిలో ఈర్ష్యా జ్వాల రగిల్చింది. "మిత్రుడు అభిమానంతో చేసే ప్రశంస కంటే శత్రువు అసూయతో చేసే ప్రశంస మరింత సత్యము"
"ద్రౌపదీ దేవి అన్ని దేశాల నుండి రాజసూయ యాగం చూడటానికి వచ్చిన రాజ శ్రేష్ఠులను, బ్రాహ్మణులను, వైశ్యులను, శూద్రులను, దగ్గరి బంధువులను, స్నేహితులను, వీర భటులను, పనివాళ్లను, పేదలను, బైరాగులను, అందరినీ ప్రతి దినం స్వయంగా విచారించి, తగిన రీతిగా దయతో అన్నంపెట్టి, అందరు భుజించిన తర్వాత అర్ధరాత్రి కాని తను తృప్తిగా భుజించేది కాదు.
అంతే కాదు, ఆ మహాయాగంలో అధముడు కూడా ప్రేమతో పూజలందు కొన్నాడు గాని, కోరుకొన్నది లభించని వాడు ఒక్కడైనా లేడు" అయినా సరే, మహా భారత కాలం నాటి నుంచీ నేటి వరకూ ద్రౌపది అనే ఈ యాఙ్ఞసేని ఎన్నో అపవాదులకు పడరాని, పడకూడని పాట్లకు లోనవుతూనే ఉంది.
ముఖ్యంగా “మయసభ” లో నీటి మడుగు లో జారిపడ్డ దుర్యోధనుణ్ని చూసి ద్రౌపది నవ్వడమే కురుక్షేత్రానికి కారణమనే వాళ్లూ చాలా మందే ఉన్నారు. కానీ, ఈ విషయాన్ని మరో మారు ఇంచుక తరచి చూడాల్సిన అవసరం ఉంది. కనీసం సవరణ కోసమైనా! రాజసూయ యఙ్ఞం అనంతరం ఎక్కడి వారక్కడి నుండి వెడలి స్వస్థానాలకు తరలి పోయారు. దుర్యోధనుడు, శకుని మాత్రం మాయసభ వైభవాన్ని కనులారా వీక్షించాలనే తపనతో కొన్ని రోజులు అక్కడే విడిదిలో ఉండి పోయారు.
అపురూపమైన ఆ సభా భవన రమణీయతకు, ముగ్దుడైన దుర్యోధనుడు ఒకరోజు, ఒంటరిగా అక్కడి కొన్ని ప్రదేశాలను తిలకించ సాగాడు. ఆ సందర్భంలో అతనికి ‘మూసి ఉన్న ద్వారం తెరచి ఉన్నట్లుగా, తెరచి ఉన్న ద్వారం మూసి ఉన్నట్లుగా, సమతల ప్రదేశం ఎత్తయినదిగా, ఎత్తయిన ప్రదేశం సమతలంగా భ్రమించి’ జారిపడి పోయాడు.
అలాగే నీలమణులు పొదిగిన ప్రదేశం జలాశయం అనుకుని దుస్తులను పైకి పట్టుకొని భ్రమతో దిగబోయాడు. నీటితో ఉన్న జలాశయాన్ని చూసి మామూలు ప్రదేశమనుకుని నడవ బోయి బట్టలు తడిసి పోగా వెనక్కి మళ్లాడు.
అప్పుడు ‘‘వానింజూచి పాంచాలియు బాండుకుమారులును నగిరి’’ అని చెప్పారు మహాభారతంలో. విషయం తెలుసుకున్న ధర్మ నందనుడు, ధృతరాష్ట్ర తనయుడికి వాయు పుత్రుడితో దివ్యవస్త్రాలు, భూషణాలు పంపించారు. దుర్యోధనుడు సభా ప్రలంభానికి సిగ్గు పడి పాండవులకు వీడ్కోలు పలికి హస్తినకు తిరిగి వెళ్లిపోయాడు.
ద్రౌపది పరిహాసాస్పద పూరితమైన ఈ హాసం (నవ్వు) కారణంగానే దుర్యోధనుడు కక్షకట్టి పగ బట్టి నిండుపేరోలగం కురుసభలో ద్రౌపదిని అవమానించాడని చాలా మంది భావించారు. ఆమె చేసిన ఈ చిన్న పొరపాటే కురుక్షేత్ర మహా సంగ్రామానికి దారి తీసిందని మరి కొందరు విమర్శించారు. నిజంగా చెప్పాలంటే సుయోధనుణ్ణి ఆ రాజసూయ యాగంలో మనసుకు హత్తుకుపోయి ఆకట్టుకున్నవి, రెండే రెండు విషయాలు.
“ఒకటి పాండవుల వైభవం,
రెండోది ద్రౌపది సామర్థ్యం”
అదీ కాక ధర్మరాజు ఆయాగంలో అత్యంత గౌరవ ప్రధమైన ‘‘నానా దేశాగతులైన రాజులు దెచ్చి యిచ్చిన యుపాయనంబులు గైకొనే’’ బాధ్యత దుర్యోధనుడికే అప్పగించాడు. బహుశ రాజు లిచ్చిన సంపద అతనిలో ఈర్ష్యాసూయలను మరింత జ్వలింపజేసి ఉండవచ్చు. అతడు తండ్రి ధృతరాష్ట్రుడిలా అంధుడు కాదు. అలాంటప్పుడు అతనికి మయసభలో 'ఏ వస్తువు ఏలా ఉందో అలా' ఎందుకు కనపడి ఉండదు? ఈ సంపద వైభవం చూసిన దుర్యోధనుడి మనసు మనసులో లేదు మాయ, భ్రమ ఆవరించి ఉండవచ్చు. అసూయ, ఈర్ష్యలతో రగిలి పోయింది. అందుకే అతనికి ఆ మయసభలో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనపడింది.
దుర్యోధనుడు తన తండ్రికి ఒకసారి ‘‘పాంచాలియు పాండు కుమారులును నగిరి’’ అని చెప్పాడు. పాండవులు, ద్రౌపది ఎప్పుడు దుర్యోధనుడు పడిపోతాడో అని నవ్వడానికి అక్కడే సిద్ధంగా ఉన్నారన్నమాట. మరొక మారు ‘‘సహస్ర విలాసినీ పరివృతమయి యున్న ద్రౌపది నగియే’’ అని అంటాడు. వేలమంది పరిచారికలతో కలిసి ద్రౌపది నవ్విందట. ఈ సందర్భంలో ‘‘అంధుడి కొడుకు అంధుడు’’ అని కూడా అందని కూడా కొంత మంది రాశారు.
జన్మతః దైవత్వాన్ని తనలో ఇముడ్చుకున్న కారణ జన్మురాలు - ద్రౌపది వ్యక్తిత్వం - గురించి అంత సాధారణంగా ఏలా ఊహిస్తాము? రమణీ లలామ, విదూషిణీ మణి, చతుషష్టి కళలలో నిష్ణాతురాలు ఐన యాఙ్ఞసేని అలా విఙ్జత మరుస్తుందా? రారాజైన ఆ సార్వభౌముని అంత హీనం గా చూస్తుందా?
అసలు పాంచాలిని - అరణ్యవాసంలో దర్శించుకోవటానికి వచ్చినప్పుడు, ‘‘ఒక్క భర్తనే నేను ఆకట్టుకోలేక పోతున్నాను, నువ్వు అయిదుగురిని ఎలా నీ వశం చేసుకున్నావు, ఏ మందులు వాడావు? ఏ మాకు లిచ్చావు?’’ అని ప్రశ్నిస్తుంది శ్రీకృష్ణసతి సత్యభామ. దానికి పాంచాలి సమాధాన మిస్తూ ఇలా అంటుంది..
"పలుమార్లు తల వాకిట నిలుచొని పరపురుషులను చూచుట, మగవారి కంట బడటానికే ఇష్టపడని అంతఃపుర కాంత తడిసిన బట్టలతో నిలబడి ఉన్న పర పురుషుణ్ని చూసి నవ్వుతుందా? తనను అపహరించడానికి వచ్చిన సైంధవుడి ఆంతర్యం తెలిసి కూడా ‘‘భూవరా! తగు విందవైతి కురువర్యుల యింటికి నట్లుగావునంబరువడి నాసన క్రియయు బాద్యము గైకొను’’ అని అతనిపట్ల గృహస్థ మర్యాదను పాటించింది.
అలాంటి ద్రౌపది దుర్యోధనుడంతటి రారాజును అంతకు మించి తన మరిది, ఆపై అతిథి, తన ఇంట పోరబడి భంగపాటుకు గురైౌతే సంస్కార హీనగా నవ్వుతుందా?
‘‘మూర్ధాభిషిక్తుడైన ధర్మరాజు, సాత్యకి ముత్యాల గొడుగు పట్టగా, భీమార్జునులు బంగారు చామరాకు వీచగా నగిరి, కృష్ణ పాండు నందన ద్రౌపదీ సాత్యకులు గరంబు సంతసమున’’ అని చెబుతాడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో. అంతటి రాజసూయాగ సందోహ సంరంభంలో మహారాణి ద్రౌపదికి, అతణ్ని చూసి నవ్వేటంత తీరిక ఎలా చిక్కింది? భీమ, నకుల, సాత్యకి, కృష్ణుడు, ధర్మరాజు కూడా తనను చూసి నవ్వారంటాడు రారాజు! కృష్ణుడు, ధర్మరాజులనూ కలిపాడంటే - విషయం సందేహాస్పధమే. రాజసూయ యాగానికి వచ్చిన వారందరూ రారాజు దుర్యోధనుణ్ణి చూసి నవ్వడానికే వచ్చారా?
ఒక్క భర్తతో సంసారం చేయాలంటనే అమ్మాయిలు అల్లాడి పోతున్నారు. మరి ఆ కాలంలో ఐదుగురు అత్యంత సమర్ధులు, జ్ఞానులైన భర్తల దగ్గర కాపురం చేసి భర్తలతో పాటు మెట్టి నింటిలో, సమాజంలో, మంచి పేరు తెచ్చుకున్న ద్రౌపదికి ఎంతో ఓర్పు, సహనంతో పాటు భర్తలను ఎలా రంజింపజేయాలో, కుటుంబాన్ని ఎలా నడపాలో, సర్వులను ఎలా ఆనందింపజేయాలో కూడా తెలుసు. కాబట్టే అలా కాపురం చేయ గలిగింది. ఐదుగురు భర్తలతో ప్రేమగా మెలుగుతూ, భర్తల ముందు ఏం చేయకూడదో ఏం చేయవచ్చో తెలుసుకుని మెలిగే ద్రౌపదికి అంత సులభంగా అతి చిన్న విషయానికి పరిహాసంగా నవ్విందనటం ఒక అపోహ మాత్రమే.
అసలు ధర్మరాజు సంపద చూసి అసూయతో రగిలిపోతున్న దుర్యోధనుడికి ‘భ్రమ’ మాయావృతమైంది. తాను భంగ పడినందుకు కాదు, పరులులెవరైనా తన భంగపాటు గమనించారేమో? అన్న బాధ ఎక్కువ భాద పెట్టి ఉండవచ్చు సుయోధనుణ్ణి, అజలే అభిమానధనుడు కదా!
బహుశా తను పడిపోయినప్పుడు పాండవులు చూశారేమో? హసించారేమో? ద్రౌపది చూసి పరిహసించిందేమో? శ్రీకృష్ణుడు చూశాడేమో? అని అనుమానాలతో తల్లడిల్లి పోయాడేమో?
ఒక వైపు పాండుపుత్రుల సంపద, అధికారం, గౌరవం, సామర్ధ్యం చూసి కన్ను కుట్టిన అసూయాగ్నికి, తనలో తనకే కలిగిన అవమానం - రెండూ కలిసి ఆయనలో ఈర్ష్యాగ్ని జ్వలించగా, తన మామ శకుని ప్రేరేపిత జూదానికి, మహారాజు తన తండ్రి దృతరాష్ట్రుని ఒప్పించడానికి ఒక్కోసారి ఒక్కోవిధంగా ‘నవ్వు’ ఆ 'హాసం' కథలు కథలుగా చెప్పి ఆయనను నమ్మించాడు.
ద్రౌపది, పాండవులు తనని చూసి నవ్వారో? లేదో? దుర్యోధనునికి స్పష్టంగా తెలుసా? తెలిసి ఉంటే తండ్రికి ఎప్పుడూ ఒకే కథ చెప్పి ఉండే వాడు ఇన్ని కథలు అల్లి, ఇంత శ్రమ పడాల్సిన పనే ఉండేది కాదు. నిజంగా వారు నవ్వడమే జరిగితే అతడు అంత సులువుగా వదిలి వెళ్ళే వాడు కాదు.
నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణ వేళ ‘‘నువ్వు నవ్వినందుకే ఈ ప్రతి ఫలం’’ అని స్పష్టంగా ఆమె ముఖం మీదే చెప్పి ఉండే స్వభావం ఉన్న వాడు సుయోధనుడు. అలా జరగలేక పోవటం ఈ విషయానికి రారాజు అంత ప్రాధాన్యత యివ్వలేదని భావించవచ్చు. అన్నింటికీ మించి వ్యాస భారతంలో దుర్యోధనుడు భంగపడ్డప్పుడు అక్కడ ద్రౌపది లేదని స్పష్టంగా ఉంటుంది. ఇదీ వాస్తవం. ఇదే యదార్ధం.
అయినా కథలల్లే వాళ్ళకి, ఈ సంఘటన మరింత రంజుగా ఉంటుంది కాబట్టి, ఆ మహాసాద్విని కించపరచి దానికి “దృశ్యావిష్కరణ ” చేయడం లోని సంతోషం మరెక్కడైనా దొరుకుతుందా? అందుకే చరిత్రల ఔన్నత్యం చిక్కి పోతుంది కాలంతో పాటు. కథల సారం కూడా పలచనౌతుంది. మగువల మానసిక ఖేదాన్ని గుర్తించే వారేరి? నాటి దుర్యోధనాదుల నుండి నేడు మగువలను చెరబట్టే వారివరకు. పరాభవించే వారి వరకు.