నువ్వు ఎంత త‌న్నుకులాడినా.. జ‌రిగేది జ‌ర‌గ‌క మాన‌దు

frame నువ్వు ఎంత త‌న్నుకులాడినా.. జ‌రిగేది జ‌ర‌గ‌క మాన‌దు



1879 డిసెంబరు 30వ తేదీ.. తమిళనాడులోని తిరుచుజి గ్రామవాసులైన అలగమ్మ, సుందరమయ్యర్‌ దంపతులకు వేంకటరామన్‌ జన్మించారు. రమణమహర్షి అసలు పేరు అదే. ఆ బాలుడు దిండిగల్‌ బడిలో సాధారణ విద్యార్థి. చదువు అంతగా పట్టుబడకున్నా, ఏకసంథాగ్రాహి కావడం వల్ల అన్నింటా నెగ్గుకొచ్చాడు. మధుర మీనాక్షిని దర్శించి ఆధ్యాత్మిక అనుభూతి పొందాడు. చదువుపై అతడి అశ్రద్ధ చూసి అన్న మందలించాడు. ఈ లౌకిక విద్యలన్నీ వ్యర్థమని వేంకటరామన్‌కు స్ఫురించింది. ఇల్లు వదిలి తిరువణ్ణామలై వెళ్లారు. భూగర్భ మందిరంలో ధ్యాన నిమగ్నుడయ్యారు. ఆయనను దర్శించేవారి సంఖ్య పెరిగింది.
జ‌రిగేది జ‌ర‌గ‌క మాన‌దు
ఒకరోజు కుమారుణ్ని వెతుక్కుంటూ తల్లి వెళ్లింది. ఆమెకు పెన్సిల్‌తో ఒక సందేశం రాసిచ్చారు… ‘ప్రతి ప్రాణికీ కర్మను అనుసరించి జీవితం ఉంటుంది. అతడు ఎంత ప్రయత్నించినా, జరిగేది జరగక మానదు’ అని! ఆయనకు ఉపన్యాస ధోరణి లేదు. శిష్యుల సందేహాలకు సూటిగా సమాధానాలిచ్చేవారు. అనేక దేశాల నుంచి పలువురు తమ సందేహాలు తీర్చుకోవడానికి రమణ మహర్షిని ఆశ్రయించేవారు. ఆత్మజ్ఞానం కలిగినవాడే ‘గురువు’ అని ఆయన చెబుతుండేవారు.
భూత ద‌య‌కు అంతే లేదు
శ్రీరమణుల భూతదయకు అంతు లేదు. పశుపక్ష్యాదులను ఆదరంగా చూసేవారు. కోతులు, ఉడతలు, పిచ్చుకల పట్ల దయాభావం చూపేవారు. జంతుభాష ఆయనకు అర్థమయ్యేది. ఒకరోజున ఓ ముసలి కోతి భుజాన కోతిపిల్ల ఉండటం చూశారు. ‘తాతా! ఎంత కష్టం వచ్చింది నీకు… ఈ వయసులో బిడ్డను పెంచాల్సి వచ్చిందే… జాగ్రత్తగా సాకు… ఇది నీకు పుణ్యమే’ అన్నారు గద్గద స్వరంతో. ఆ కోతిపిల్లకు తల్లి చనిపోయింది. తల్లిలేని పిల్లను పెంచాల్సిన బాధ్యత పెద్ద కోతిదే! ఈ విషయం మహర్షికి తెలుసు. అలాగే ఆయన ఒక గోవుకు లక్ష్మి అని పేరుపెట్టి పెంచారు.
శ్రీ‌ర‌మ‌ణ స‌ద్గురు
‘శ్రీరమణ సద్గురు’ అని శిష్యులు ఆయనను పిలిచేవారు. భ‌క్తులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయన ఇచ్చిన జవాబులు ‘శ్రీరమణ గీత’గా ప్రసిద్ధి చెందాయి. హంఫ్రీస్‌ అనే పాశ్చాత్యుడు ఓ అంతర్జాతీయ మనోవిజ్ఞాన శాస్త్ర పత్రికలో రాసిన వ్యాసం వల్ల, ఆయన ప్రఖ్యాతి అంతటా వ్యాపించింది. సూరినాగమ్మ ‘రమణాశ్రమ లేఖలు’ తెలుగు ప్రజలకు ఆయనను మరింత చేరువ చేశాయి. ‘ఎ సెర్చ్‌ ఇన్‌ సీక్రెట్‌ ఇండియా’ గ్రంథకర్త పాల్‌ బ్రంటన్‌- రమణ మహర్షి వైభవాన్ని స్తుతించారు. మనశ్శాంతి కోసం వెళ్లిన కావ్యకంఠ గణపతి ముని ఆయనలోని మహాపురుషుణ్ని దర్శించారు. కృష్ణుడు రేపల్లె విడిచి వెళ్లేటప్పుడు గోపికల శోకం, రామాయణ గాథలో ‘తారా విలాపం’ కథాభాగం వింటున్నప్పుడు- అనుభూతితో ఆయనకు కన్నీళ్లు ఆగేవి కావు. అదీ రమణ మహర్షి మనసు! అతి క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాన్ని సైతం సులభ శైలిలో అందరికీ అర్థమయ్యేలా వివరించేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: