పండుగలకి ఇంటి ముందు మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా ?
మామిడాకులు దేవతా స్వరూపాలకు ఆహ్వానం పలికే పరమ పవిత్రమైన పత్రాలుగా పాత్ర వహిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. అందుకనే పండుగలకు ఆ దేవుళ్ళను మన ఇంట్లోకి ఆహ్వానించగలిగే మామిడి ఆకులను గుమ్మానికి తోరణాలుగా కట్టడం శుభ సూచకమైన ఒక కారణం. అంతే కాకుండా మామిడి ఆకులలో ఎన్నో ప్రత్యేకమైన వైద్య గుణాలు ఉన్నాయి. శుభకార్యాల్లో పండుగల సమయంలో మన ఇంటికి ఎంతో మంది చుట్టాలు మరియు బయటివారు వస్తుంటారు. అలాంటి వారికి ఎవరికైనా అంటువ్యాధులు లాంటివి ఏవైనా ఉంటే, మనం గుమ్మానికి కట్టిన మామిడి తోరణాల ద్వారా వచ్చే వాసనను మనం పీలుస్తుంటాము కాబట్టి ఆ అంటువ్యాధులు మనకు సోకకుండా ఉంటాయి. అంటే ఆ వ్యక్తులకు ఉన్నటువంటి రోగాలు మనకు అంటుకోకుండా మామిడి ఆకులు రోగనిరోధకశక్తి వాహకాలుగా పనిచేస్తాయి.
అంతేకాకుండా మామిడి ఆకులు ఇంటికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తేవడంతో పాటు, నిద్రలేమిని పోగొడతాయి అని చెబుతున్నారు. అందుకే ఇన్ని మంచి లక్షణాలు ఉన్న మామిడి ఆకులను మాత్రమే మన ఇంటి ముందు గుమ్మాలకు తోరణాలుగా కట్టాలి అని పెద్దలు చెప్పిన ఆచారం. కాలాలు మారుతున్నా మన సంస్కృతి సంప్రదాయాలలో ఈ పద్ధతి మారకపోవడం నిజంగా అదృష్టం. ఇప్పటికీ ఈ పద్ధతి అందరూ పాటిస్తూ మన హిందూ సంప్రదాయాలను గౌరవిస్తున్నారు