మాములుగా మానవ జీవితంలో జరిగే ప్రతి శుభకార్యానికి ఒక ముహూర్తం, మంచి సమయాన్ని నిర్ణయిస్తారు . ఆ ముహూర్తాలను బట్టి అన్ని కార్యక్రమాలు జరిగిపోతుంటాయి. ముఖ్యంగా వివాహాలకు కొన్ని మాసాలలో మాత్రమే ముహుర్తాలు ఉంటాయి ఇవి మాత్రమే వివాహాలకు తగిన సమయాలుగా చెప్పబడ్డాయి. వీటిని హిందూ సంప్రదాయం ప్రకారం ఎప్పటి నుండో ఆచరిస్తూ వస్తున్నారు. అయితే ఒక్క మాసంలో మాత్రం పెళ్లిళ్లు పూర్తిగా నిషెందించారు ఇది మన పూర్వీకుల నుండి వస్తున్నదే. ఇంతకీ ఆ మాసం ఏమిటంటే ఆషాడమాసం. ఆషాడమాసంలో సాధారణంగా ఎన్నో విశిష్ట పూజలు జరుపుతుంటారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలకు ఆషాడమాసం పెట్టింది పేరు. అయితే శుభకార్యాలకు మాత్రం ఈ మాసం అనుకూలం కాదని ఆచారంలో ఉంది. హిందువులు మన సంస్కృతి సంప్రదాయాలను ఎంత గౌరవిస్తూ ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు జీవితాలు కలిపి ఒకటిగా ముందుకు సాగే వివాహ బంధం అనగా పెళ్లి అనే శుభకార్యంలో అత్యంత జాగ్రత్తగా అన్ని ఆచారాలను పాటిస్తుంటారు.
అదే విధంగా మన పూర్వీకులు నుండి వస్తున్న అంశం ఆషాడ మాసంలో వివాహాలు శుభకార్యాలు జరపకూడదు అనే దాన్ని కూడా తూచ తప్పకుండా పాటిస్తున్నారు. అంతేకాకుండా ఆషాడమాసంలో భార్య భర్తలు, అత్తా కోడళ్ళు దూరంగా ఉండాలనే పద్దతి కూడా ఎప్పటి నుండో పాటిస్తున్నదే. అయితే ఇంతకీ ఈ ఆషాడమాసం ఎందుకు శుభకార్యాలకు అనుకూలం కాదు అంటే అందుకు పురాణాల్లో పలు కారణాలు చెప్పబడ్డాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం ఆషాడ మాసం లోనే శ్రీమహావిష్ణువు యోగ నిద్ర లోకి వెళ్లారని చెప్పబడింది. అంటే ఈ మాసంలో జరిగే శుభకార్యాలకు ఆ శ్రీమహావిష్ణువుని ఆశీర్వాదం అందుకనే యోగ్యం లేదని చెప్పబడింది. అంతేకాకుండా మనిషి యొక్క పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆషాడమాసం సంప్రదాయాన్ని తీసుకొచ్చినట్లు చెబుతున్నారు పెద్దలు. భారతదేశంలో వ్యవసాయం ఎక్కువన్న సంగతి తెలిసిందే. అయితే
ఈ ఆషాడమాసం సమయంలో పంటలేవి చేతికి అంది రావు తద్వారా ఆదాయం ఉండదు.
ఇలాంటి సమయంలో ఖర్చుతో కూడుకున్న పెళ్ళిళ్ళు ఇతర శుభకార్యాలు చేయడం కష్టమైన విషయమని సంప్రదాయం పేరిట ఈ ఆచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కొందరు పెద్దలు చెబుతున్నారు. అంతేకాకుండా ఇది వర్ష రుతువు ప్రారంభమయ్యే సమయం కూడా అయినందున వర్షాలు ఈదురు గాలుల కారణంగా శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ పద్ధతిని ఆచరణలోకి తీసుకొచ్చినట్టు కొందరి అభిప్రాయం. ఇలా పలు కారణాల వలన మన పూర్వీకుల నుండి ఆషాడమాసంలో శుభకార్యాలు జరగడం లేదు.