ఇష్టకామేశ్వరి దేవి ప్రత్యేకత ఇదే ?
భారతదేశం మొత్తం మీద ఇష్ట కామేశ్వరి అన్న మాట లేదు. అయితే ఒక్క శ్రీశైలంలోనే ఇష్ట కామేశ్వరిగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. శ్రీశైలంలో ఇష్ట కామేశ్వరి ఆలయం చాలా ప్రాచీనమైనది. ప్రస్తుతం అది చాలా శిధిల అవస్థలో ఉంది. ఇక్కడ అమ్మవారు నాలుగు చేతులతో దర్శనమిస్తారు. ఒక చేతిలో రుద్రాక్ష మాల ..మరొక చేతిలో శివలింగం పట్టుకుని ఉంటారు. మిగిలిన రెండు చేతులతో వైష్ణవ సంప్రదాయంలో పద్మములను చేత పట్టుకుని ఉంటారు. అమ్మవారి ఈ రూపం దేశంలో మరెక్కడా లేదు. అయితే ఎవరైతే శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకుని వారి కోర్కెలను అమ్మవారితో మొర పెట్టుకుంటారో వారి కోర్కెలను ఇష్టకామేశ్వరి మాత తప్పక నెరవేరుస్తారని ప్రతీతి. భక్తుల ఇష్ట కార్యాలను అమ్మవారు సిద్ధించేలా చేస్తుంది కనుకనే ఇక్కడ అమ్మవారిని ఇష్టకామేశ్వరి అంటారు అని చెబుతారు.
అలా వారి కోర్కెలు తీరిన వారు తిరిగి ఆలయానికి వచ్చి వారి మొక్కులను తీరుస్తుంటారు. అంతే కాకుండా ఇక్కడ అమ్మవారి విగ్రహానికి కుంకుమ బొట్టు పెడితే మానవ శరీరానికి మెత్తగా తగులుతుంది. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం.. ఇది అమ్మవారి విగ్రహమా లేక మానవత రూపమా అన్న భావన కలుగుతుంది. ఇలా శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఎన్నో రహస్యాలు, వింతలు దాగి ఉన్నాయి.