అమ్మవారు "తలుపులమ్మ" గా మారడం వెనుకున్న కథిదే ?
దారకొండపై నిరంతరం ఓ జలధార పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది, అందుకే ఆ కొండకు దారకొండ అని పేరు వచ్చింది. ఈ కొండల మధ్య ఉన్న కొండలో కొలువై ఉంది తలుపులమ్మ. ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.. కృతయుగంలో అగస్త్య మహర్షి ఈ అడవి మార్గంలో పయనిస్తున్న సమయంలో సంధ్యా వందనం చేసుకునేందుకు సమయం కాగా ఎక్కడ నీరు కనిపించలేదట, సమయం మించి పోతుండడంతో అగస్త్య మహర్షి అమ్మ వారికి విన్నవిస్తూ ప్రార్ధన చేయగా, ఆయన ప్రార్థనలు విన్న అమ్మవారు కొండపై జలధార ను ఉప్పొంగేలా చేసింది. అనంతరం సంధ్యా వందనం ముగించుకున్న అగస్త్యుడు అమ్మవారిని ఈ పచ్చని అడవుల మధ్య కొలువై ఉండమని విన్నవించాడు.
భక్తుని మాట కాదనలేక అక్కడే శిలగా వెలసింది జగన్మాత. అప్పటి నుండి అగస్త్య మహర్షి కూడా అమ్మవారికి సేవలు చేస్తూ అక్కడే ఉండేవారని పురాణం చెబుతోంది. ఇక అప్పటి నుండి భక్తులు కోరిన వరాలను అందిస్తూ తలుపులమ్మగా ప్రసిద్ధి పొందారు జగన్మాత. ప్రతి సంవత్సరం చైత్ర మరియు ఆషాఢ మాసాలలో ఈ క్షేత్రంలో వేడుకలు ఎంతో ఘనంగా ను వైభవంగా చేస్తారు. ఇక్కడి దారకొండ పై నుండి ప్రవహించే పాతాళ గంగ లోని నీరు తేనె వలె తియ్యగా ఉండటం ఎంతో విశేషం.