శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
ఈ నెల 17వ తేదీన ఆలయంలోని మహా మండపంలో వేద మంత్రాల నడుమ అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాలు తిరుమల గిరులపై 15 - 16 శతాబ్ధాల వరకు జరిగినట్లు ఆధారాలున్నాయి. 1962 వ సంవత్సరం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ నాలుగు మాఢ వీధుల్లో ఊరేగి.. భక్తులను కటాక్షిస్తారు. ఆగస్టు 18న పవిత్ర ప్రతిష్ఠ, ఆగస్టు 19న పవిత్ర సమర్పణ, ఆగస్టు 20న పూర్ణాహుతి నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 18 నుంచి 20 వరకు వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అదే విధంగా ఆగస్టు 17న అంకురార్పణ సందర్భంగా సహస్ర దీపాలంకార సేవను రద్దు చేసింది. కొవిడ్ నేపథ్యంలో శ్రీవారి పవిత్రోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.