ద్వారక వేల సంవత్సరాల క్రితం జన సముదాయంతో కళకళలాడిన మహానగరం. ఇది శ్రీ కృష్ణుడు నడిచిన చోటు, అయితే కాలంతో పాటు ఈ మహా నగరం కూడా సముద్ర గర్భంలో కలసి పోయింది అని పురాణాలు చెబుతున్నాయి. ద్వారక నగరం ఎందుకు నిర్మించబడింది.. ఆ తర్వాత సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఇలా ద్వారకకు సంబంధించిన ఎన్నో రహస్యాలు గురించి ఇపుడు తెలుసుకుందాం. జరాసంధుడు కృష్ణుడికి వ్యతిరేకి... కృష్ణయ్యను ఓడించడానికి నిత్యం మదుర నగరంపై తన సైన్యంతో దండయాత్ర చేస్తుండేవాడు. ఆ యుద్ధంలో ఎంతోమంది మధుర నగర ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయే వారు. తమ బిడ్డల కష్టాలను చూడలేని కిట్టయ్య. అతని బారి నుండి మధుర నగర ప్రజలను కాపాడటానికి ఒక కొత్త నగరాన్ని సముద్రం మద్యలో నిర్మించి ప్రజలను అక్కడికి తరలించాలని.. నిర్ణయించుకున్నారు. దాంతో జరాసంధుడి బాధ మధుర నగర వాసులకు తీరుతుందని భావించాడు.
అనుకున్నదే తడువుగా విశ్వ కర్మను పిలిపించి మధుర నగర ప్రజల అయినటువంటి యాదవుల కొరకు ఒక సురక్షితమైన, సుందరమైన నగరం నిర్మించమని సూచించారు. అలాగే ఈ నగర నిర్మాణం కొరకు భూమిని ఇవ్వాలంటూ సముద్రుడిని కృష్ణుడు ఆదేశించగా...వెనువెంటనే సముద్రుడు వెనక్కి జరిగి పన్నెండు యోజనాల భూభాగాన్ని ఇచ్చినట్లు మన పురాణాల్లో చెప్పబడింది. ఆ అద్భుతమైన ప్రదేశంలో ( గోమతీ నది సముద్రం లో కలిసే చోటులో) విశ్వకర్మ నిర్మించినటువంటి అందమైన నగరమే ద్వారక. ఆ కాలంలో ఈ మహా నగరాన్ని స్వర్ణ ద్వారక అనేవారట . ఇది చాలా పెద్ద మహానగరం అని తెలుస్తోంది... ఈ నగరంలో 900 లక్షల రాజభవనాలు ఉండేవట... ఈ లెక్క వింటుంటేనే ఆ నగరం ఎంత పెద్దదో అర్థం అవుతోంది. అంతే కాకుండా ఈ ద్వారకా నగరాన్ని విశ్వకర్మ .. వజ్రాలు, క్రిస్టల్స్, ముత్యాలు, బంగారం వంటి అపురూపమైన రత్నాలతో నిర్మించారు.
అక్కడి భవనాల గోడలపై కృష్ణయ్యకు సంబంధించిన వంద రకాల సన్నివేశాలను బంగారు పూతతో శిల్పాలను చెక్కి ఉన్నట్లు చెబుతున్నారు.
ఇంతటి ప్రతిష్టాత్మకమైన నగరానికి పెను ముప్పు వాటిల్లింది. అదేమిటంటే..?? కురుక్షేత్రం గురించి అందరూ వినే ఉంటారు... ఆ యుద్ధం చివరి ఘట్టంలో దుర్యోధనుడు ఒక్కడు తప్ప..మిగిలిన తొంబై తొమ్మిది కౌరవులు తమ ప్రాణాలను కోల్పోయారు. అప్పుడు శ్రీ కృష్ణ పరమాత్మ బిడ్డలను పోగొట్టుకున్న బాధతో దుఃఖిస్తున్నటువంటి కౌరవుల తల్లి గాంధారిని పరామర్శించుట కొరకు దగ్గరకు వెళ్లగా... ఆమె కోపంతో రగిలి పోతూ ఉంటుంది. శ్రీకృష్ణుడిని చూసిన ఆమె నీకు నా బిడ్డ ప్రాణాలు కాపాడాలని ఏమాత్రం అనిపించినా ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణంలో ఆపగలిగే వాడివి. కానీ నీవు అలా ఎందుకు చెయ్యలేదు అని ప్రశ్నించగా అందుకు కృష్ణుడు ఇలా ఒక సమాధానం ఇచ్చారట.. మాత గాంధారి నీ భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడు పూర్వ జన్మలో ఒక హంస మరియు దానికి పుట్టినటువంటి 100 పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశాడు. దాని కర్మ ఫలితమే ఈ జన్మలో తన దృష్టిని కోల్పోయాడు అదే విధంగా తన బిడ్డలను పోగొట్టుకున్నాడు. ఇది ఆయన కర్మ ఫలితం, కర్మ నుండి ఎవరిని ఎప్పుడూ తప్పించ లేము అంటూ సమాధానం ఇచ్చారు.
అందుకు మరింత ఆగ్రహానికి గురైన గాంధారి దేవి... నా భర్త అంటే తప్పు చేశారు ఇది ఆయన కర్మ.. మరి ఏ పాపము ఎరుగని నాకెందుకు ఇంత పెద్ద శిక్ష అంటూ నీవు నాలాగే కనుల ముందరే నీ పిల్లలను కోల్పోయే పరిస్థితి వస్తుంది, నీ యాదవ జాతి మొత్తం నీతోటే అంతమై పోవాలి అంటూ శపించింది. అలా ఆమె శాపమే యాదవులలో చిచ్చు రగిలేలా చేసింది. పదవుల కోసం గొడవలు ఒకరినొకరు చంపుకొనే వరకు వెళ్ళింది. దాంతో కృష్ణ భగవానుడు అది చూడలేక మిగిలిన వారిని ఆ ప్రదేశం నుండి వేరే ప్రాంతానికి మార్చి తను ఈ లోకం వీడి శాశ్వతంగా వెళ్ళిపోతాను అంటూ అలాగే నా తర్వాత ద్వారకానగరం అంతమవుతుంది అని అర్జునుడికి తెలిపినట్లు పురాణాల్లో ఉంది. అలా ద్వారక వీడి అడవులకు వెళ్లిపోయిన కృష్ణుడికి పొరపాటున బాణం తగిలి మరణిస్తాడు. ఇది లోక కళ్యాణం కోసమే. కృష్ణుడి అవతారానికి ముగింపు పలుకుతాడు. అనంతరం సముద్రుడు ఒక సునామీలా ఎగసి మళ్లీ ద్వారకానగర భూభాగాన్ని తనలో కలుపు కుంటాడు. అలా ద్వారకా నగరం సముద్ర గర్భంలో కి వెళ్ళిపోతుంది.