దుర్గమ్మ దర్శనానికి పొటెత్తిన భక్తులు
కరోనా కారణంగా మహామండపం లిఫ్ట్ మార్గాన్ని అధికారులు మూసివేశారు. కేవలం ఘాట్ రోడ్డు ద్వారా మాత్రమే భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు కుంకుమ పూజలు నిర్వహించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వివిధ రకాల పూలతో అంతరాలయాన్ని అలంకరించారు అధికారులు. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి ఖడ్గమాల పఠనంతో తొలి పూజ ప్రారంభించారు. సహస్ర కుంకుమార్చనతో అమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజును వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. అమ్మవారు వరలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మ దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఉచిత ప్రసాదం అందించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు క్యూ లైన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ.. శానిటైజేషన చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.