ఈ సారి కూడా ఏకాంతమే..!
అక్టోబర్ నెల 7వ తేదీ గురువారం నుంచి మొదలు కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు... 15వ తేదీ వరకు జరగనున్నాయి. ఓ వైరపు థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. తొలిరోజు ఉదయం ధ్వజారోహణంతో స్వామి వారి బ్రహ్మత్సవాలు ప్రారంభం కానున్నాయి. శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ రుత్వికులు ధ్వజారోహణంతో ముక్కోటి దేవతలను శ్రీవారి బ్రహ్మోత్సవ వేడుకలకు ఆహ్వానించనున్నారు. అదే సమయంలో బ్రహ్మరథం కూడా తిరుమాఢ వీధుల్లో తిరుగాడనుంది. అదే రోజు సాయంత్రం నుంచి స్వామి వారు భక్తులకు వివిధ వాహనాలపై దర్శనమివ్వనున్నారు.
తొలిరోజు రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్ప స్వామి వారు పెద శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 8వ తేదీ శుక్రవారం ఉదయం చిన్న శేష వాహనంపై, రాత్రి హంస వాహనంపైన ఊరేగనున్నారు. 9వ తేదీ శనివారం ఉదయం సింహవాహనంపై, రాత్రి ముత్యపు పందిరి వాహనంపై స్వామి వారు తిరగనున్నారు. 10వ తేదీ ఆదివారం ఉదయం కల్ప వృక్ష వాహనంపై, రాత్రి సర్వ భూపాల వాహనంపై దర్శనమిస్తారు. 11వ తేదీ సోమవారం ఉదయం మోహిని అవతారంలో ఉంటారు. ఆదే రోజు సాయంత్రం ఎంతో విశిష్టమైన గరుడ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు తిరుమల శ్రీవారు. 12వ తేదీ మంగళవారు ఉదయం హనుమంత వాహనంపైన, రాత్రికి గజ వాహనంపై స్వామి వారు మాఢ వీధుల్లో తిరుగాడనున్నారు. అదే రోజు జరగాల్సిన స్వర్ణ రథోత్సవ సేవ బదులుగా సర్వ భూపాల వాహన సేవ జరుగుతుంది. 13వ తేదీన బుధవారం ఉదయం సూర్య ప్రభ వాహనంపై, రాత్రికి చంద్ర ప్రభ వాహన సేవ జరుగుతుంది. 14వ తేదీన గురువారం ఉదయం రథోత్సవం జరగాల్సి ఉంది. కానీ ఏకాంతం కారణంగా సర్వ భూపాల వాహనంపైనే స్వామి సేవ నిర్వహిస్తారు. అదే రోజు చివరగా అశ్వ వాహన సేవ జరుగనుంది. ఇక విజయదశమి రోజున 15వ తేదీ ఉదయం చక్రస్నానం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.