రేపటి నుంచే సాయిబాబా దర్శనం..!

కరోనా కారణంగా నిలిచిన షిర్డీ సాయిబాబా దర్శనం... మళ్లీ భక్తులకు కలగనుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలతో పాటు... షిర్డీ సాయిబాబా ఆలయం కూడా మూత పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఆలయాన్ని మూసివేసిన సంస్థాన్ ట్రస్ట్ బోర్డు అధికారులు... భక్తుల రాకపై నిషేధం విధించారు. దేశంలో అత్యధికంగా వైరస్ కేసులు మహారాష్ట్రలోనే నమోదు అవుతుండటంతో సంస్థాన్ ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు ఆరు నెలల పాటు ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. ఇక సాయిబాబా నిత్య హారతులు, సేవలు మాత్రం యాధావిధిగా ఏకాంతంగా నిర్వహించారు. అయితే ప్రస్తుతం వైరస్ తీవ్రత తగ్గడంతో... షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలోనికి భక్తులను తిరిగి అనుమతించాలని నిర్ణయించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి.
కొవిడ్ నేపథ్యంలో కీలక సూచనలు చేసింది షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ బోర్డు. మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచనల మేరకు ప్రతి రోజు కేవలం 15 వేల మంది భక్తులను మాత్రమే సాయిబాబా దర్శానానికి అనుమతిస్తారు. అదే సమయంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మాస్క్ లేని వారిని ఆలయంలోనికి అనుమతించరు. ఇక 65 ఏళ్లు దాటిన వారితో పాటు గర్భిణీలు, పదేళ్ల లోపు పిల్లలకు ఆలయ ప్రవేశం లేదని ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. సాయిబాబా దర్శానానికి వచ్చే భక్తులు ముందుగా ఆన్ లైన్ ద్వారా దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలని కూడా సంస్థాన్ ట్రస్ట్ బోర్డు అధికారులు తెలిపారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని... వసతి గదుల కేటాయింపులో కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక కరోనా వ్యాక్సిన్ టీకా రెండు డోసులు వేయించుకున్న వారి తప్పనిసరిగా సర్టిఫికేట్ తీసుకురావాలని కూడా సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: