పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయము.కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. జగన్నాథుడు (విశ్వానికి ప్రభువు) పేరుతో ఆలయ దైవం ఉంటుంది. సంస్కృత భాషలో జగత్ (విశ్వం), నాథ్ (ప్రభువు) అని అర్థం.హిందూ ఆచారాల ప్రకారం, భక్తులకు ముఖ్యంగా విష్ణువు, కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన "ఛార్ థాం" పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది.నాలుగు దశాబ్దాల అనంతరం పూరీ జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం తెరుచుకోనుంది. స్వామివారికి అపార సంపదలు, వైజ్రవైఢ్యూర్యాలు పొదిగిన ఆభరణాలు ఉన్నాయి. కానీ, ఇవి ఎలా ఉంటాయో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో లెక్కింపునకు ఒడిశా ప్రభుత్వం సిద్ధమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపడతారు. అయితే, ఇది ఎప్పుడు పూర్తవుతుందో నిర్దిష్టంగా చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకూ కమిటీ సభ్యులందరూ నియమ నిష్టలతో ఉంటారు.పూరీ జగన్నాథుడి ఆలయ సంపదను 46 ఏళ్ల తర్వాత లెక్కించనున్నారు. జులై 14 నుంచి ప్రభుత్వ నియమించిన కమిటీ ఆధ్వర్యంలో ఈ లెక్కింపు మొదలుకానుంది.
కానీ, పూరీ జగన్నాథుడి రత్నభండాగారంలోని రహస్య గదిని తెరిచేందుకు సన్నద్ధమవుతోన్న అధికారులకు పాముల భయం వెంటాడుతోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు.. పాములు పట్టడంలో నైపుణ్యం ఉన్న వారికోసం వెదుకుతున్నారు. జగన్నాథ ఆలయ యంత్రాంగం అధికారి మాట్లాడుతూ.. ‘‘రత్న భాండాగారం తెరిచే సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపొందించి, అనుమతి కోసం ప్రభుత్వానికి పంపాం.. గది తెరిచే వేళ పాములు పట్టేవారు, ఓ వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని కోరాం’’ అని తెలిపారు.అయితే, పూరీ కలెక్టరేట్ ట్రెజరీలో డూప్లికేట్ తాళపుచెవి ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి, బీజేపీ ప్రభుత్వం.. రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. గత 46 ఏళ్లుగా రత్నభాండాగారం తలుపులు తెరవకపోడంతో అందులో పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదు. దీంతో జగన్నాథుడి సంపద లెక్కింపుపై సర్వత్రా ఆసక్తి నెలకుంది. ఆలయ కింది భాగంలోని రత్న భాండాగారం తెరిచిన అనంతరం.. సంపద లెక్కింపు, ఆభరణాల భద్రత, మరమ్మతులపై ప్రభుత్వానికి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ ఓ నివేదికను అందజేయనుంది.