మహశివరాత్రి గొప్పదనం




మహశివరాత్రి 

శివ పార్వతుల వివాహం జరిగిన రోజు

శివుడు శక్తి తో సంగమించిన రోజు 'శివుడి యొక్క బృహత్ రాత్రి'

చంద్రుడు శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర తో కూడిన రోజు

శివుడు లింగాకృతి పొందిన రోజు




మహా శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది.

సాధారణంగా “ప్రతినెల కృష్ణ చతుర్దశి”  రోజు వస్తూనే ఉంటుంది,  దీనిని "మాసశివరాత్రి" అంటారు. ఆ రోజున ఈశ్వరుని ఆలయాల్లో విశేష పూజలు చేయిస్తూ ఉంటారు.  

మాఘ మాసంలో వచ్చే శివరాత్రికి ఉన్న ప్రత్యేకతల దృష్ట్యా దీన్ని “మహాశివరాత్రి” అంటారు. "మహాశివరాత్రి"  పర్వదినం చాలా విశిష్టమైనదని పండితులు అంటున్నారు.




ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని శివరాత్రి గురించి ఆడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ప్రీతి పాత్రమైనదంటాడు , ఆ ఒక్క రోజు  ఉపవాసమున్నాసరే తనెంతో సంతోషిస్తానని చెబుతాడు.


ఆయన చెప్పిన దాని ప్రకారం, ఆరోజు పగలంతా నియమనిష్ఠతో ఉపవాసంతో గడిపి, రాత్రి నాలుగుజాముల్లోనూ శివలింగా న్ని పంచామృతాలతో అనగా  మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో,  చివరకు పంచదారతో  అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిదులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రివ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు.


మహాశివుడంటే ఆది దేవుడు, ఆది యోగి అని  అందరికి తెలుసు. కాని, రాత్రి కి ప్రత్యేకార్థము ఉంది. "రా" అన్నది,  దానార్థక ధాతు నుండి "రాత్రి" అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసే దాన్నే రాత్రి అంటారు.

ఋగ్వేద - రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ యిలా చెప్పబడింది – “హే రాత్రే!  అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక!”




"మహాశివరాత్రి" పర్వదినాన ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి, శుచిగా తలస్నానం చేసి, పూజా మందిరమును, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలను ధరించి, శివుని పటాలు, లింగా కార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి.


మారేడు దళములు, తెల్లపూలమాలతో భోళాశంకరుడి అలంకరించి, పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్టతో పూజించాలి. పూజా సమయంలో శివ అష్టోత్తరము, శివపంచాక్షరీ మంత్రములను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్షమార్గాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.


అదేవిధంగా, నిష్ఠతో ఉపవాసముండి శివసహస్ర నామము, శివ పురాణము, శివారాధన పారాయణం చేసే వారికి మరు జన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి, మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు శివపరమాత్మ స్తోత్రములతో ఆయన పూజ చేసిన వారికి కైలాసవాసం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు.


ఈ పర్వదినం నాడు శివుణ్ణి బిల్వపత్రాలతో పూజిస్తారు.  శివ భక్తులకు అత్యంత పర్వదినం రోజంతా ఉపవాసం మరియు రాత్రి అంతా జాగరణ చేసారు. ఇది. పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు “పండితారాధ్య చరిత్రము” లో విపులంగా వర్ణించాడు.




రోజు


శైవులు ధరించే  భస్మము లేదా విభూది  తయారుచేయటానికి పవిత్రమైనదని భావిస్తారు. రోజు అంతా భక్తులు "ఓం నమః శివాయ", శివ యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు. తపస్సు, యోగ మరియు ధ్యానం చేస్తారు, అవసరార్దులకు వేదవిధులకు సహాయం చేసి ముక్తిని పోందే మార్గాన్ని సుగమం చేసు కుంటారు. శివభక్తులు అతి సులభంగా ఆధ్యాత్మిక శక్తి పెంచడానికి పూజాధికాలు నిర్వహిస్తారు. మహా మృత్యుంజయ మంత్రం వంటి మంత్రాల పఠనంతో శక్తి వంతమైన ప్రయోజనాలు పొందుతారు. 




మహశివరాత్రి 

పురాణం ప్రకారం, ప్రళయకాలం లో సముద్ర మదనం నుండి అనేకమైన విశిష్ట వస్తువులతో పాటు బహు ప్రమాదకరమైన హాలాహలం ఉద్భవించింది. హాలాహలం యొక్క ఘోరమైన ప్రభావాల నుండి సమస్థ విశ్వాన్ని రక్షించటం కోసం శివుడు ఆ హాలాహలం తీసుకోవడం తన యోగ బలం ద్వారా తన గొంతులో హాలాహలాన్ని బందించటం తో అది తన గొంతు లోనే నిలిచి ఆయన గరళకంఠుడు గా నిలిచిపోయాడు.  ఆయన మెడ ఆకారణంగా నీలంగా మారి నీలకంఠుడు అనికూడా పిలుస్తాము.


ఆ విష ప్రభావంతో సొమ్మసిల్లిన ఆ దైవానికి శీతలత్వం, ఉపశమనం కలిగించటానికే మనం జాగరణ చేసి ఆయన్ని ఎంతగా స్తుతిస్తే ఆయన అంతగా ఆనంద పడతాడని ఆ రాత్రి శివఘోషతో కాలం గడుపుతాము. ఆయనకు దగ్గరలో ఉండి ఉపవాసం చేసి జాగరణ తో గడపటం ఆచారంగా మారింది. 



 

ఒక ప్రళయ కాల సమయము లో మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయం లోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు. దాని వివరాలు ఇలాఉన్నాయి.



 


ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేషశయ్యపై నిద్రిస్తున్న విష్ణువును చూసి, "నీవెవరవు, నన్ను చూసి కూడా లేచి రాకుండా గర్వముతో శయ్యపై పడుకున్నావు, నీకే కాదు ఈ సకలచరాచర జగత్తుకు ఆదిదేవుడు ప్రభువైన నేను వచ్చి ఉన్నాను. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది " అని అంటాడు.




ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగం తో వచ్చాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించే వాడను" అంటాడు.


అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించి నావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అంటాడు.


ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగారు.




ఇలా సమరం జరుగుతుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు.ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాస మైన కైలాసానికి చేరుకుంటారు. ఈశ్వరునికి దేవతలు స్తోత్ర-స్థుతులతో ప్రణమిల్లుతారు.




అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో  "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్నప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను పార్వతీదేవితో బయలు దేరుతాడు.


యుద్ధానికి వెళ్ళి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయం లో శివుడు అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు.




బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం యొక ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై,  బ్రహ్మ ఆది తెలుసు కొనుటకు హంసరూపుడై బయలు దేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన చోటుకు వస్తాడు.


బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మార్గ మధ్యంలో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు (బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి.



ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మసమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి బయలుదేరిన చోటుకు  వచ్చి, అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు.


కాని, శివుడు ఆ రెండింటిని  వివరము కోరగా, బ్రహ్మస్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది.  జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమై శివుడి గా ప్రత్యక్షం అవుతాడు.


అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు అందుకొంటాడని ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.




శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తి తో ఈ బ్రహ్మను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాల లో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తి తో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నం గా బ్రహ్మకు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మ ను ఇప్పుడు క్షమించుము అన్నాడు.


ఆ మాటలు విన్న శివుడు శరణు జొచ్చిన బ్రహ్మను కారుణ్యమును ప్రకటించి “బ్రహ్మని క్షమించి, "ఓ బ్రహ్మా నీకు గొప్పనైన దుర్లభమైన వరమును ఇస్తున్నాను, అగ్నిష్టోమము, దర్శ మొదలగు యజ్ఙములలో నీది గురుస్థానము. ఎవరేని చేసిన యజ్ఙములలో అన్నిసరిగా నిర్వర్తించి, యజ్ఙనిర్వహణముచేసిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చినా, నీవు లేని యజ్ఙము వ్యర్థము అగును" అని వరమిచ్చెను.


ఆతరువాత “కేతకీపుష్పము (మొగలిపువ్వు) వైపుచూసి, అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండుగాక”  అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా? అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపములో నాపై ఉంటుంది అని చెబుతాడు.


అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోళా శంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, " మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందు కొనును" అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరములు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడు చున్నవి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: