పవిత్ర మాసం – రంజాన్..! ఉపవాసాలతో ఉపయోగాలెన్నో..!!

Vasishta

రంజాన్ పేరు వినగానే మనకు హలీం గుర్తుకొస్తుంది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్. అల్లాను భక్తిశ్రద్ధలతో ఆరాధించే మాసం. రంజాన్ మాసంలో ముస్లింలందరూ విధిగా రోజా పాటిస్తారు. ఈ మాసంలో చేసే మంచి పనులకు ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుందనేది వారి నమ్మకం. అందుకే మంచిని చేసేందుకు ఈ నెలలో పోటీ పడుతుంటారు.


          ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్. ఈ మాసంలోనే దివ్యఖురాన్ ఆవిష్కృతమైందని నమ్ముతారు ముస్లింలు. ఆ అల్లా ఇచ్చిన వరంగా భావిస్తారు. అందుకే ఈ మాసమంతా దివ్య ఖురాన్ పఠనంలో ముస్లింలు మునిగిపోతారు. పవిత్ర ఖురాన్ పఠనం ద్వారా గతంలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, అల్లా క్షమిస్తారని నమ్ముతారు. ఖురాన్ లోని ప్రతీ వాక్యం చదివిన ప్రతిసారి సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. అందుకే ఈ మాసంలో ఖురాన్ పఠనం విధిగా చేస్తారు. మనుషులందరూ సన్మార్గంలో నడవాలనేది ఖురాన్ సారాంశం. ఇందుకు అవసరమైన అన్ని అంశాలనూ ఖురాన్ లో పేర్కొన్నారు. రంజాన్ మాసంలో ఉపవాసం ద్వారా సన్మార్గానికి సోపానం కలుగుతుందని ముస్లిం సోదరులు భావిస్తారు.


          రంజాన్ మాసాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. ఒకటో రోజు నుంచి పదో రోజు వరకూ రహమత్ అంటారు. ఇది కారుణ్యానికి సంబంధించినది. 11వ రోజు నుంచి 20వ రోజు వరకూ బర్కత్ అంటారు. ఇది దైవమన్నింపునకు సంబంధించినది. ఇక 21వ రోజు నుంచి 30 వ రోజు వరకూ మగఫిరత్ అంటారు. ఇది విముక్తి కలిగించేది.  ఇక రంజాన్ మాసంలో నమాజ్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సాధారణంగా ముస్లింలు రోజూ ఐదుసార్లు నమాజ్ చదువుతారు. పండగరోజుల్లో ప్రత్యేక నమాజ్ ఉంటుంది. రంజాన్ మాసంలో ప్రత్యేకంగా తరావీ నమాజ్ కూడా చదువుతారు. ఈ నమాజ్ ను చంద్రదర్శనంతో ప్రారంభి.. మళ్లీ చంద్రదర్శనంతో ముగిస్తారు.


          రంజాన్ మాసంలో ఉండే ఉపవాసాల ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. ఉపవాసం వల్ల శారీరకంగానే కాక మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా నిష్కల్మషమైన మనసు చేకూరుతుంది. పుణ్యం సిద్ధించడం ద్వారా మానసిక ప్రక్షాళన కలుగుతుందని భావిస్తారు. చెడు అలవాట్ల నుంచి విముక్తి కలిగి ఉన్నత వ్యక్తిత్వం కలుగుతుందని నమ్ముతారు. అంతేకాక.. రంజాన్ మాసంలో ఉపవాసాల ద్వారా అనారోగ్యపరమైన సమస్యల నుంచి విముక్తి లభించినట్టు పలు అధ్యయనాలు రుజువు చేశాయి. శరీరంలో పేరుకుపోయిన మలినాలు వైదొలగడం ద్వారా శారీరక శుద్ధి కలుగుతుంది. ఇది ఆరోగ్యానికి సూచిక.


          రంజాన్ మాసంలో సహర్, ఇఫ్తార్ లకు ఎంతో ప్రధాన్యముంది. ఉపవాస దీక్ష ముగింపు సమయంలో ఫలహారాలు తీసుకునే సమయాన్ని ఇఫ్తార్ అంటారు. తెల్లవారుజామున ఉపవాసం ప్రారంభించే సమయంలో చేసే ఆహార సమయాన్ని సహర్ అంటారు. ప్రతి ఇంట్లో ఈ సందడి నెలంతా కనిపిస్తుంది. ఇక రంజాన్ మాసమంతా ప్రత్యేక వంటలు ఘుమఘుమలాడుతుంటాయి. ముఖ్యంగా హలీం నోరూరిస్తుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: