రమజాన్ మాసం - సకల మానవాళికి - వేకువ గీతం

ఇది రమజాను నెల. అంటే సంపూర్ణ వినయ, విధేయతలు, దానధర్మాల మార్గం అనుసరించవలసిన నెల. భౌతికంగా తరావీహ్‌ (జాగారాలు) మాసం, ఖుర్‌ఆన్‌ జన్మించిన    అవతరించిన మాసం. ఖుర్‌ఆన్‌ను అర్థం చేసుకోవాల్సిన మాసం, ఖుర్‌ ఆన్‌ సుస్వర ధ్వనుల్ని సమస్త మానవాళికి చేరవేసి వారి భవిష్యుత్తుకి బంగారు బాటలు వేయ వలసిన మాసం. 

సహనం, నిగ్రహం చూపవలసిన మాసం, అవసరార్థులను, అగత్యపరులను, అభాగ్యజీవులను, అనాథలను, వితంతువులను, వికలాంగులను ఆదుకోవాల్సిన మాసం. ఇది సకల శుభాల శ్రవణం. ఇది విఙ్జాన ప్రకాశ తోరణం. ఇది కార్యణ్యవారుణి. ఇది అనుగ్రహవర్షిణి. ఇది వరాలవాహిని. ఇది నిశాంత ప్రశాంత ప్రభాత గీతిక. ఇది విశ్వజనీన సమాజానికి చైతన్య దీపిక.

రమజాన్‌ - ప్రపంచ వ్యాప్తంగా మానవాళిలో ఉన్న భిన్న ఆలోచనా ధోరణులను, వ్యక్తిత్వాలను ఏకోన్ముఖం చేసి లక్ష్యసాధనా మార్గంలో నడిపిస్తుంది. వారందరిని ఏకతాటిపై తెచ్చి తౌహీద్‌ (ఏకేశ్వరో పాసన) ప్రాతిపదికన వారందరిని బలమయిన వ్యక్తులుగా - సత్య సమర యోధులుగా, శాంతి దూతలుగా తీర్చిదిద్దుతుంది. మనిషి మానస పరిధిలో ఏర్పరచుకున్న భేద భావ రీతులు, కులం, వర్గం, వర్ణం అన్న జాఢ్యాలకు లోను కాకుండా, వాటి విషపుకోరల్లో చిక్కుకొని ఇరుకైన మనసులో గోడలు నిర్మించుకుని భావదారిద్య్రంతో, పదార్థ దాస్యంతో మరుగుజ్జులుగా మారకుండా, అందరిని ప్రేమించే, అందరిని గౌరవించే సాత్విక జీవులుగా, శాంతి కాముకులుగా సకల మానవాళిని రమజాన్ మలుస్తుంది. 

మనల్ని మనం గౌరవించుకోకుండా, మనకంటూ ఒక బలమయిన వ్యక్తిత్వాన్ని నిర్మించు కోకుండా అందరూ మనల్ని గౌరవించాలని, మన వ్యక్తిత్వాన్ని గుర్తించాలను కోవడం కన్నా మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదని, మనిషికి కూడు, గూడు, గుడ్డ, గాలీ, నీరు, వేడిమి ఎంత అవసరమమో స్వీయ గౌరవం, స్వీయ వ్యక్తిత్వం అంతే అవసరం అని, శ్వాసించాలన్నంత బలమయిన కాంక్ష తో మనం శ్రమించినప్పుడే అవి మనకు ప్రాప్తిస్తాయని రమజాన్ హితోక్తులు పలుకుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: