జీవితసత్యం చాటి చెప్పిన అలగ్జాండర్ చక్రవర్తి మూడు కోరికలు

ప్రపంచాన్ని జయించి తన పాదాక్రాంతం చేసుకోవాలన్న తపనతో అతి శక్తివంతమైన సైన్యంతో గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్, ది గ్రేట్ - అనేక దేశాలను జయించుకుంటూ భారత్ పై జైత్రయాత్రను ప్రారంభించిన రోజులవి. సువిశాల మగధ సామ్రాజ్య సరిహద్దుల సమీపానికి చేరి - మగధ రాజేంద్రుల వైభవం గమనించి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకుంటాడు. కాని మగధ అపార సెనావాహిని, దాని శక్తి సామర్ధ్యాల గురించి విన్న తన సైనిక పారావారం మగధపై దాడిని అంగీకరించరు. కారణం మాసిడోనియా వదిలేసి ససైన్యంతో వివిధ దేశాలను జయించుకొంటూ వస్తుండటం కొన్ని సంవత్సరాలైనందున  వారందరికి కూడా ఇంటిపై ధ్యాస మళ్ళింది.  తనతోపాటు తనసైన్యం కూడా అలసటకు గురైనారు.

అందుకే భీభత్సమైన నాటి పాటలీపుత్ర సైనికపాటవం ముందు తట్టుకోవటం అసంభవమని గమనించిన అలగ్జాండర్ కూడా జబ్బున పడటం జరుగుతుంది. అందుకే తిరిగి ససైన్యంగా ఇంటికి వెళుతున్నాడు. మార్గ మధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణశయ్యపై చేరాడు. తాను మరణించడం తథ్యమని అలెగ్జాండర్ కు అవగతమై పోయింది.తాను సాధించిన గొప్ప గొప్ప విజయాలు, అమిత శక్తిసంపన్నులైన తన సైన్యం, అంతు లేని సంపద, తనను మరణం నుంచి దూరం చేయలేవని ఆయన కు అప్పటికే స్పష్టమైపోయింది.

ఇంటికి వెళ్ళాలనే కోరిక తీవ్రతరమైంది. తన తల్లికి కడసారిగా తనముఖాన్నిచూపించి కన్నుమూయాలనే ఆశ. కానీ సమయం గడిసేకొద్దీ దిగజారుతు సహకరించని అతని ఆరోగ్యం, నిస్సహాయంగా ఆఖరి శ్వాసకోసం ఎదురుచూస్తున్నాడు తన సైన్యాధిపతులను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు.


“నేను ఇంకా కొద్దిక్షణాల్లో ఈ లోకం నుంచి నిష్క్రమించ బోతున్నాను. నాకు చివరగా మూడు కోరికలు మిగిలి ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నెరవేర్చవలసిందేనని,  నెరవేర్చకుండా విస్మరించకండి.” అని వారిని కోరి - వారి నుండి వాగ్ధానం తీసుకున్నాడు. అశ్రునయనాలతో కడసారిగా తమ చక్రవర్తి ఆజ్ఞను వినమ్రంగా అంగీకరించారు ఆ అధికారులు.


నా మొదటి కోరిక:  ” నా శవ పేటికను కేవలం నా వైద్యులు మాత్రమే మోయాలి


రెండవ కోరిక: “నా పార్థివదేహం  స్మశానానికి  వెళ్ళేదారిలో నేను సంపాదించిన విలువైనవజ్రాలు, మణి మాణిక్యాలు పరచండి


మూడవ కోరిక: “శవపేటిక నుంచి నా ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచండి


చుట్టూ మూగి ఉన్న సైనికులు ఆయన విచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోయారు.  కానీ వారిలో ఎవ్వరికీ ఆయన్ను అడిగే ధైర్యం లేకపోయింది. అలెగ్జాండర్ కు అత్యంత ప్రీతి పాత్రుడైన ఒక సైనికుడు దగ్గరగా వచ్చి, ఆయన చేతులను ముద్దాడి, ఆయన కోరికలను తప్పకనెరవేరుస్తామని మాటఇచ్చాడు. ఈ కోరికల వెనక ఆంతర్యమేమిటో సెలవియ్యమని ప్రాదేయ పడ్డాడు . 


అలెగ్జాండర్ అతి కష్టమ్మీద ఇలా అన్నాడు. “ఈ మూడు కోరికలు నా ఆంతర్యంలో పొంగిపొరలుతున్న ఆలోచనల నుండి  నేర్చుకున్న మూడు పాఠాలకు ప్రతిరూపాలు.”


“మొదటి కోరికలోని నా ఆంతర్యం:  నిజానికి ఏ వైద్యుడూ మరణాన్ని ఆపలేడు . ఒకవేళ  వైద్యం చేసినా వల్లకాటికి చేరేవరకే"  అని చెప్పడానికి.


“రెండవ కోరికలోని నా ఆంతర్యం: నా జీవితంలో సింహభాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది. అయితే అదేదీ నా వెంట తీసుకెళ్ళలేకపోతున్నాననీ, కేవలం సిరిసంపదల వెంటబడి విలువైన సమయాన్ని, జీవితంలో మాధుర్యం కోల్పోవద్దని చెప్పడానికి”


“మూడవ కోరికలోని నా ఆంతర్యం: ఈ ప్రపంచంలోకి నేను వచ్చేటపుడు వట్టి చేతులతో వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను" అని చెప్పడానికే  అని చెపుతూ కన్ను మూశాడు.

అలెగ్జాండర్ అమితమైన రాజ్యకాంక్షగల చక్రవర్తే కావచ్చు. భారత భూభాగంలో నేర్చుకున్న ఆధ్యాత్మిక ఙ్జానం ఆయన హృదయాంతరాళాల్లో ఇంకిపోయింది. ఆయన గురించిన ఈ సంఘటనలో భారతీయ ఆత్మ దాగి ఉంది, 33 సంవత్సరాల వయసుకే తన గురుదేవులైన అరిస్టాటిల్ ఆఙ్జానువర్తిగా ఆ విశ్వవిఖ్యాత సార్వభౌముడు తన జీవితాదర్శాన్ని వ్యక్తీకరించే ఆధ్యాత్మిక సారం ఉంది. అందుకనే ఈ సంఘటన చిరస్మరణీయంగా చరిత్రలో నిలిచిపోయింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: