ఎల్లవేళలా సత్యమే చెప్పాలంటే సాధ్యమా! అసత్యం చెప్పినా తప్పుకాని సందర్భాలు కూడా ఉన్నాయి!

అన్నివిషయాలలోనూ అన్నివేళాలా అందరి వద్దా సత్యమే చెప్పాలా! అబద్ధం చెప్పకూడదా! సమయాన్ని బట్టి, సందర్భాన్నిబట్టి, దేశ, కాల, మాన పరిస్థితులను బట్టి అబద్ధాలు కూడా చెప్ప వచ్చు. పసిపిల్ల వానికి అన్నం పెట్టే తల్లి “అమ్మో! బూచాడు వస్తున్నాడు. అన్నం తినకపోతే నిన్ను పట్టుకుపోతాడు” అంటుంది. ఎన్నెన్నో అబద్ధాలు చెప్పి అన్నం తినిపిస్తుంది. ఇది అసత్య నేరం కిందకు రాదు కదా!


శ్లో॥ సత్యం సత్యు సదా ధర్మః, సత్యం ధర్మః సనాతనః, సత్యమేవ సమస్యేత, సత్యం హి పరమాగతిః॥ సత్యం ధర్మస్తపోయోగః సత్యం బ్రహ్మ సనాతనం, సత్యం యజ్ఞః పరఃప్రోక్తః, సర్వం సత్యేప్రతిష్ఠితమ్‌॥


సత్యము గొప్పది. ఉత్తములైన వారు సత్య ధర్మాన్నే పాటిస్తారు. సత్యము సనాతనమైనది. సత్యము దైవ సమానం. సత్యమే పరమ ధర్మము. సత్యమే తపస్సు. సత్యమే పరబ్రహ్మము. సత్యపాలన యజ్ఞ ఫలమిస్తుంది. జ్ఞానము విజ్ఞానము దైవము ధర్మము మోక్షము అన్నీ సత్యములోనే వున్నవి. అలా ధర్మశాస్త్రం చెప్పినా కూడా:


ఒక తో ఒక భర్త తన భార్యను సంతోష పెట్టడానికి “నువ్వు చాలా బాగుంటావోయ్! నువ్వంటే నాకెంత యిష్టమో తెల్సా! నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా వుండలేను” అని అతిశయంగా మాట్లాడవచ్చు. ఆ మాటలలో ఎలాంటి నిజం లేకపోయినా, అందులో అబద్ధాలు ఉన్నా సరదా అనో, లౌక్యమనో అర్థం చేసుకోవాలే తప్ప అసత్యం అని అనడానికి లేదు. ఇది అసత్య దోషం కిందకు రాదు.


నోములు వ్రతాలు చేయించే పండితుడు తంతు నడిపించేటపుడు అక్కడ ఏమీ లేకపోయినా “పూగీ ఫలస్య కర్పూరై: నాగవల్లీ దళైరుత్యం ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతామ్. తాంబూలం సమర్పయామి” అని తాంబూలాన్ని దేవుని ముందు పెడతాడు. ఓ స్వామీ! కర్పూరము ముత్యాల పొడి వక్క మొదలైన సుగంధ ద్రవ్యాలతో నిండిన తాంబూలాన్ని సమర్పిస్తున్నాము స్వీకరించు” అని శ్లోకానికి అర్థం.


కాని తాంబూలంలో ముత్యాల పొడి కర్పూరం లాంటివి వుండవు. అన్నీ ఉన్నట్టే మంత్రం చెబుతాడు. అవన్నీ ఉన్నట్టుగా, వాటిని దేవుడికి అర్పిస్తున్నట్టుగా భావన చేయ మంటాడు. మనం కూడా అలాగే చేసేస్తుంటాం. ఇది అసత్యం కదా! దేవునికే అసత్యం చెప్పవచ్చా! నిజానికి దేవుడికి అబద్ధాలు చెప్పకూడదు. దేవుడికేం ఖర్మ ఎవ్వరికీ అబద్ధాలు చెప్పకూడదు.


నా మనసులో ఇంత ఘనంగా చేయాలను కున్నాను కాని నాకున్న శక్తి చాల లేదు. కనుక ఈ ప్రత్యామ్నాయాలతో ఈ పూటకి ఇలా నడిపించేస్తున్నాను. తిరస్కరించకు స్వామీ! అని వేడుకోమంటాడు. మనం ఎంత గొప్పగా పూజ చేయాలనుకున్నా లోపాలు, లోటు పాట్లు ఉండనే ఉంటాయి. అందుకని లెంపలు వేసుకుని: 


“మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే ” అనిపించి క్షమాపణ మంత్రం చెప్పిస్తాడు. పూజ ఎంతో బాగాచేయాలని ఉన్నా చేయలేక పోయాడు కదా! అని దేవుడు దయతలచి మన విన్నపాన్ని స్వీకరిస్తాడు అని పెద్దలు చెప్పిన మాట. ఇవి అశక్తత ప్రకటనలే తప్ప అసత్యాల కిందికి రావు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: