ధోని పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్..!
ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ లో కనిపించనున్నాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న గా మారిపోయింది. భారత తో పాటు ఇతర దేశాల క్రికెట్ అభిమానులు కూడా మూడు ఐసిసి ట్రోఫీలను (2007 ప్రపంచ టి 20, 2011 వన్డే ప్రపంచ కప్ & 2013 ఛాంపియన్స్ ట్రోఫీ) గెలుచుకున్న ఏకైక కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ని మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో చూడాలని బాగా కోరుకుంటున్నారు.
జూలై, 2019 లో న్యూజిలాండ్ - భారత క్రికెట్ టీమ్స్ మధ్య జరిగిన 2019 వన్డే ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ లో ఓటమి పాలయింది భారత్. ఆ రోజు నుండి మహేంద్రసింగ్ ధోని ఎటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడలేదు. అయితే చాలా మంది ధోని కి గాయాలు అవ్వడం వలన విశ్రాంతి తీసుకుంటున్నారని భావించారు. అతను కొంతకాలం రాంచీలో బ్యాట్ పట్టుకొని క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు కానీ ఆ తర్వాత అతను ఏ సిరీస్ లో కనిపించలేదు. దీంతో ధోనీ అందుబాటులో ఎందుకు ఉండట్లేదని అనేక అనుమానాలు రేకెత్తాయి. అతను ఇప్పటికే క్రికెట్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడా? అతను పదవీ విరమణ ప్రకటించబోతున్నారా? అని ఎంతోమంది ఊహాగానాలు చేసుకున్నారు. ఎవరూ ఊహించని రీతిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటాడు ధోనీ. దీంతో అతను శాశ్వతంగా క్రికెట్ నుండి రిటైర్ అవ్వాలనుకుంటున్నాడా? అని చాలామంది అనుకున్నారు. అతను నిజంగా సెట్ ప్రోటోకాల్‌ను అనుసరించడు. ధోనీ ఇకపై టెస్టులు ఆడటం ఇష్టం లేదని నిర్ణయించుకున్నప్పుడు, అతను 2014 లో ఒక టెస్ట్ సిరీస్ ఆడుతున్న సమయంలో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నానని ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేశాడు.
ధోనీ దాదాపు ఆరు నెలల్లో ఇండియన్ క్రికెట్ టీమ్ తరఫున ఏ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు కాబట్టి ఈ సంవత్సరం జనవరి నెలలో కేంద్ర కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితా నుండి అతన్ని తొలగించాల్సి వచ్చింది. సెలెక్టర్ల మాజీ చైర్మన్ ఎంఎస్‌కె ప్రసాద్ భారత క్రికెట్ జట్టులోకి తిరిగి రావడానికి ధోని గ్రౌండ్ లో తన క్రికెట్ ప్రతిభ చూపించి తాను ఫామ్ లోనే ఉన్నానని నిరూపించుకోవలసి ఉంటుందని చెప్పాడు. కోచ్ రవిశాస్త్రి ఐపిఎల్‌లో బాగా రాణించినట్లయితే, ధోని ఆస్ట్రేలియాలో జరిగే టి 20 ప్రపంచ కప్‌కు జట్టులో తిరిగి రావచ్చని పేర్కొన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ టీం తరఫున ధోని మంచి క్రికెట్ ప్రదర్శన చూపితే అతను ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆడే ఛాన్స్ ఉంటుంది. కరోనా కారణంగా చాలా విశ్రాంతి దొరికిన ధోనీ మంచి కంబ్యాక్ ఇవ్వడానికి ఇది అద్భుతమైన సమయమని మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డీన్ జోన్స్ తెలిపాడు. డీన్ జోన్స్ భారతీయ క్రీడా ఛానళ్లలో పని చేశాడు. ఇతను ఐపీఎల్ హోస్ట్ బ్రాడ్‌కాస్టర్ గా పని చేశాడు. ప్రస్తుతం అతను ధోని పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.