రైనా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Sreekanth E
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. వచ్చే ఏడాది మళ్లీ తను బ్యాట్ పట్టనున్నట్లు ప్రకటించాడు. కాగా ఈ ఏడాది ఆగస్టు 15న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన నిమిషాల వ్యవధిలోనే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే అనంతరం యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13 సీజన్ లో రైనా తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున గ్రౌండ్ లోకి దిగుతాడని అతని అభిమానులు సంతోషపడ్డారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే రైనా తిరిగి భారత్ కు చేరుకున్నాడు.

సురేష్ రైనా తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ యజమాన్యం అతని పేరును తమ ఆటగాళ్ల లిస్ట్ నుంచి తొలగించింది. దీంతో రైనా మళ్ళీ బ్యాట్ పడతాడా లేదా అనే అనుమానం క్రికెట్ అభిమానుల్లో మొదలైంది. అయితే త్వరలోనే జరిగే సయ్యద్ ముస్తక్ ట్రోఫిలో ఉత్తర ప్రదేశ్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నట్లు రైనా తాజాగా ప్రకటించాడు. అలానే ఐపీఎల్ 14 సీజన్ లో కూడా ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అయితే రైనా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కాంట్రాక్టును వదులుకోవడంతో మళ్ళీ ఐపీఎల్ వేలానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రైనాను చెన్నై జట్టు తిరిగి కొనుగోలు చేస్తుందా లేకా ఇతర ఫ్రాంచైజీ తరపున రైనా ఆడతాడా చూడాలి మరి.

 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు ముందుకొచ్చిన  రైనా... ఇటీవలే సెప్టెంబర్ 27న తన 34వ పుట్టినరోజు సందర్భంగా  మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. తన కూతురు పేరిట ఉన్న  ఎన్జీవో గ్రేసియా రైనా ఫౌండేషన్‌ తరపున ఉత్తరప్రదేశ్, జమ్ము కాశ్మీర్ , ఎన్‌సీఆర్‌లో ఉన్న 34 ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య, తాగునీటి వసతి సౌకర్యాలు, శానిటైజేష‌న్‌ లాంటి మౌలిక వసతులను  కల్పించే బాధ్యత  తీసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: