వన్డే చరిత్రలోనే అద్భుతం.. 43 ఫోర్లు, 14 సిక్స్‌లు.. ఆ బ్యాట్స్‌మెన్ ధాటికి గ్రైండ్ దద్దరిల్లిపోయింది

yekalavya
ఇంటర్నెట్ డెస్క్: వన్డే చరిత్రలోనే అదో అద్భుతమైన మ్యాచ్. తెల్లబంతి క్రికెట్ చరిత్రలో అప్పటివరకు అలాంటి విధ్వంసాన్ని ఎవరూ చూసి ఉండరు. బ్యాట్స్ బాదుడుకు బౌలర్లు ప్రేక్షకుల్లా మారిపోయిన మ్యాచ్. ఒక్క ఇన్నింగ్స్‌లో ఏకంగా 43 ఫోర్లు, 14 సిక్సులు కొట్టి ఓ భారీ స్కోరుతో మ్యాచ్‌ను ఎండ్ చేశారు. ఇంతకీ ఆ జట్టేదో తెలుసా..? శ్రీలంక. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ అరవింద డిసిల్వ, అసాంక గురుసిన్హ, అర్జున రణతుంగ, సనత్ జయసూర్యల ధాటికి ప్రత్యర్థి జట్టు ఉక్కిరిబిక్కిరి అయింది. 1996 మార్చి 6వ తేదీన కెన్యా, శ్రీలంక మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ ఇప్పటికీ ఓ చారిత్రక మ్యాచ్‌గా క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్‌లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు నమోదుతో అప్పటి వరకు ప్రపంచ కప్ చరిత్రలోనే భారీ స్కోర్ నమోదైంది. శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. ఇక ఈ భారీ స్కోర్‌ను బీట్ చేయడానికి చాలా సంవత్సరాలే పట్టింది.

తొలుత టాస్ గెలిచిన కెన్యా కెప్టెన్ మారిస్ ఒడుంబే బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి బంతి నుంచే బాదడం మొదలు పెట్టింది. సనత్ జయసూర్య, రోమేష్ కలువిదర్ణ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించి తమ ఇంటెన్షన్ చెప్పేశారు.  రోమేష్ 18 బంతుల్లో 33 పరుగులు చేయగా.. జయసూర్య 27 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఆ తరువాత వచ్చిన అసంకా గురుసిన్హా, అరవింద డెసిల్వా ధాటికి కెన్యా బౌలర్లు వణికిపోయారంటే అతిశయోక్తి కాదు. కెన్యా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. బంతి పడితే బౌండరీనే అనేలా వీరబాదుడు బాదేశారు. గురుసిన్హా 103 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేయగా.. డెసిల్వా 115 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లతో ఏకంగా 145 పరుగులు చేశాడు. ఇక రణతుంగ కూడా అంతే స్థాయిలో వీరవిహారం చేశాడు. 40 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 75 పరుగులు చేసి కెన్యా బౌలర్లకు వీరవిహారానికి అసలు అర్థం నేర్పారు. ఇక కెన్యా బౌలర్లలో ఒడుంబే ఒక్కడే రెండు వికెట్లు తీసుకుని పర్వాలేదనిపించారు.

అనంతరం బ్యాటింగ్ దిగిన కెన్యా ఆ స్కోరును ఛేదించలేక.. మొదటి నుంచే చతికిలబడింది. అంతేకాదు శ్రీలంక బౌలర్ల ముందు నిలవలేకపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెన్యా తరపున స్టీవ్ టికోలో(90, 95 బంతుల్లో), హితేశ్ మోదీ(82 బంతుల్లో 41) కొద్దిగా బ్యాటు ఝుళిపించారు. ఫలితంగా శ్రీలంక జట్టు కెన్యాపై 144 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక బౌలర్లలో మురళీధరన్ 2, రణతుంగ 2 వికెట్లు తీశారు. వాస్ కు 1, ధర్మసేనకు 1 వికెట్లు దక్కాయి. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక కొట్టిన ఫోర్లు, సిక్సుల రికార్డు చాలా కాలం వరకు ఎవరూ బీట్ చేయలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: