పవర్ పంచ్ తో పసిడి పతకం పట్టేశాడు..!

NAGARJUNA NAKKA
మన భారతీయులు సత్తా చాటుతున్నారు. ఏ దేశంలో అడుగుపెట్టినా... మన పవర్ ఏంటో చూపిస్తున్నారు. దుబాయ్ వేదికగా ఆసియా జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. పలు దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ కాంపిటీషన్ లో తమ పవర్ ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా తమ దేశానికి పతకాలు పట్టుకుపోవాలనే ఆరాటంతో బరిలోకి దిగుతున్నారు. అందుకోసం ఎంతో శ్రమించే ఈ స్థాయికి వచ్చారు.
అయితే దుబాయ్ లో జరిగే ఆసియా జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిలో మన వాళ్లూ బరిలోకి దిగుతున్నారు. తాజాగా భారత బాక్సర్ రోహిత్ చమోలీ గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ పోటీల్లో 48కేజీల విభాగంలో పోటీపడ్డాడు. ఈ రోజు జరిగిన ఫైనల్ లో మంగోలియాకు చెందిన ఒకగోన్ బయర్ ను ఓడించి భారత్ కు తొలి స్వర్ణాన్ని అందించాడు. మొదటి రౌండ్ లో ఓడిపోయిన చమోలీ.. తర్వాత పుంజుకొని 3-2తేడాతో గెలిచాడు. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే ఆరు కాంస్య పతకాలు నెగ్గింది. ఈ విషయాన్ని బాక్సింగ్‌ ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించింది. రోహిత్‌కు విషెస్ చెప్పింది.
మరోవైపు 70కేజీల విభాగంలో గౌరవ్ సైనీ, 81కేజీల విభాగంలో భరత్ జూన్ లు మెన్స్ కేటగిరీలో పసిడి పతకాల కోసం వేట సాగించనున్నారు. అంతేకాదు ఇక బాలికల కేటగిరీలో 46కేజీల విభాగంలో ముస్కాన్, 48కేజీల విభాగంలో విషు రథీ, 52కేజీల విభాగంలో తను, 57కేజీల విభాగంలో అంచల్ సైని, 60కేజీల విభాగంలో నికిత, 63కేజీల విభాగంలో మహి రాఘవ్, 70కేజీల విభాగంలో రుద్రిక, 75కేజీల విభాగంలో ప్రాంజల్ యాదవ్, 81కేజీల విభాగంలో సంజన, కీర్తి ఫైనల్స్ లో తలపడనున్నారు.
ఇప్పటి వరకు జరిగిన బాలికల సెమీ ఫైనల్స్ లో 50కిలోల విభాగంలో దేవికా, 54కిలోల విభాగంలో ఆర్జూ, 66కేజీల విభాగంలో సుప్రియ రావత్ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇక జూనియర్ విభాగంలో మన ఇండియా ఇప్పటికే ఆరు బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకుంది. ఇక సోమవారం ఫైనల్స్ జరుగనున్నాయి. అందులో ఎవరి సత్తా ఏంటో తెలిసిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: