ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎక్కడ ఎపుడు మ్యాచ్ జరిగినా కామెంట్లతో సోషల్ మీడియాలో సందడి మాములుగా ఉండదు. క్రికెట్ లో భాగంగా కొన్ని సార్లు ప్లేయర్స్ వింత వింత చేష్టలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. కానీ కొన్ని సార్లు కోపంతో చేసే కొన్ని పనులు సైతం ఎంతో వినోదంగా ఉంటాయి. అలాంటి ఒక సంఘటన గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. కరోనా కారణంగా గత సంవత్సరం జరగాల్సిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి కరోనా కొంచెం గ్యాప్ ఇవ్వడంతో గత వారం రోజుల నుండి ఎంతో రసవత్తరంగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఒక్క ఇండియా నుండి తప్ప దాదాపుగా అన్ని దేశాల నుండి ప్లేయర్స్ ఈ లీగ్ లో పాల్గొన్నారు.
ఇందులో నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ అయిన కీరన్ పొలార్డ్ మైదానంలో ఎంత సీరియస్ గా ఉంటాడో అందరికీ తెల్సిందే. ఇది చాలా సార్లు మనము చూసాము. ఐపీఎల్ లో సైతం ఒక విషయంలో పొలార్డ్ కు మరియు క్రిస్ గేల్ గొడవ పడిన విషయం ఇంకా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు నిన్న జరిగిన మ్యాచ్ లో పొలార్డ్ ఏకంగా అంపైర్ పై తన కోపాన్ని చూపించాడు. నిన్న ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మరియు సెయింట్ లూసియా కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సెయింట్ లూసియా బౌలర్ వికెట్లను దూరంగా భారీ వైడ్ వేసినా దానిని అంపైర్ నిగెల్ డుగుయిడ్ వైడ్ ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మామూలుగానే కామ్ గా ఉండని పొలార్డ్ వైడ్ ఇవ్వకపోవడంతో ఎంతో కోపానికి గురయ్యాడు.
దీనితో అంపైర్ ను ఏమీ అనని పొలార్డ్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో దాదాపుగా మిడ్ వికెట్ వైపు వెళ్లి తన నిరసన తెలియచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో మరియు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సైతం ఈ మధ్యన అంపైర్లు దారుణంగా తమ నిర్ణయాలను ఇస్తున్నారని వారి పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు అయితే ఎప్పుడో ఒకేసారి తప్పులు జరగడం మామూలే అంటూ అంపైర్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక్కోసారి ఒక్క వైడ్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది. ప్రతి ఒక్క డెసిషన్ చాలా ముఖ్యం.