టీమిండియాకు 'మిడిల్ ఆర్డర్' ముప్పు...

VAMSI
నిన్న ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా ల మధ్య జరిగిన మొదటి వన్ డే లో రాహుల్ సేన దారుణ ఓటమిని చవి చూసి సిరీస్ లో 0-1 తో వెనుకబడింది. మొదట టాస్ గెలిచిన బావుమా బ్యాటింగ్ ఎంచుకోవడంతో అందరిలో ఆశ్చర్యం వేసింది. కానీ తన నిర్ణయం సరైనదేనని ఇండియా బ్యాటింగ్  అప్పుడు తెలిసింది. సౌత్ ఆఫ్రికా నిర్ణీత ఓవర్లలో 296 పరుగులు చేసి 297  పరుగుల లక్ష్యాన్ని ఇండియా ముందు ఉంచింది. అయితే 300  లోపు లక్ష్యం కాబట్టి ఏ భారత్ అభిమాని కూడా ఈజీగా గెలుస్తుంది అని ఊహించారు.
కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ 31 పరుగుల తేడాతో మ్యాచ్ ను ఓడిపోయి సిరీస్ లో వెనుకబడింది. ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటా అని ఆలోచిస్తే చిన్న పిల్లాడు కూడా ఇట్టే చెప్పేస్తాడు. ఓపెనర్లు మరియు వన్ డౌన్ వరకు మ్యాచ్ ఇండియా చేతుల్లోనే ఉంది. కానీ ఒక్కసారి కోహ్లీ మరియు ధావన్ లు ఔటయ్యారు. అంతే ఇక భారమంతా మోయాల్సిన మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. విజయానికి అద్భుతమైన బాటలు వేసిన కోహ్లీ ధావన్ ల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు.
ఆఖరి టెస్ట్ లో మెరుపు సెంచరీ చేసిన కీపర్ యంగ్ గన్ రిషబ్ పంత్ పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ పంత్ ఎప్పటిలా కాకుండా పూర్తిగా రక్షణాత్మక ధోరణిలో ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. కేవలం 16 పరుగులు మాత్రమే చేసి ఇండియా ఓటమికి కారణమయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ సైతం బాధ్యత లేని ఆటతో ఇండియా ఓటమికి కారణం అయ్యాడు. ఇక కెరీర్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న వెంకటేష్ అయ్యర్ కూడా సంయమనం పాటించకుండా వికెట్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఇండియా మిడిల్ ఆర్డర్ దారుణంగా ఉంది. ఈ విషయంలో కోచ్ ద్రావిడ్ కనుక దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో మరీ దారుణమైన ఓటములను రుచి చూడాల్సి వస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: