గోల గోల.. అంతా సురేష్ రైనా కోసమే?
జట్టులోని బ్యాట్స్మెన్లు అందరూ కూడా పేలవ ప్రదర్శన చేసినప్పటికీ ఒంటి చేత్తో చెన్నై సూపర్ కింగ్స్ కు ఎన్నో విజయాలను అందించాడు సురేష్ రైనా. ఇక అలాంటి సురేష్ రైనా ను రిటైన్ చేసుకోకుండా మెగా వేలంలోకి వదిలేసింది చెన్నై జట్టు యాజమాన్యం. ఇక ఆ తర్వాత మెగా వేలంలో అతని కొనుగోలు చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ యువ ఆటగాళ్ల పై దృష్టి పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ యజమాన్యం సురేష్ రైనా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక ఇదే సమయంలో అటు ఇతర ఫ్రాంచైజీలు కూడా సురేష్ రైనాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. దీంతో ఐపీఎల్ లో ఎంతో అనుభవమున్న సురేష్ రైనా ఒక అన్ సొల్డ్ ఆటగాడిగా మిగిలిపోయాడు.
అయితే ఇతర ఫ్రాంచైజీ ల సంగతి పక్కన పెడితే చెన్నై మాత్రం సురేష్ రైనా విషయంలో వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. 2020 లో కరోనా వైరస్ కారణంగా సురేష్ రైనా ఆడలేకపోయాడు. 2021లో అంచనాలను అందుకోలేకపోయాడు. అయితే ఒక సీజన్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని వేలంలో కొనుగోలు చేయకపోవడం సరైంది కాదని కామెంట్లు పెడుతున్నారు సురేష్ రైనా అభిమానులు. కాగా ఇప్పటివరకు ఐపీఎల్లో 205 మ్యాచ్లు ఆడిన సురేష్ రైనా 5525 పరుగులు చేశాడు. ఇందులో 39 అర్థ సెంచరీలు కూడా ఉండటం గమనార్హం.