వరల్డ్ కప్ గెలవటానికి ధోని కాదు.. అతనే కారణం : గంబీర్
గంభీర్, నేరుగా ధోని పేరు చెప్పకుండా, 2007, 2011 ప్రపంచ కప్‌లలో అతనిని హీరోగా నిలబెట్టడానికి ఒక వ్యక్తి, అతని PR టీమ్ బాగా ప్రయత్నించారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే, రెండు టోర్నీల్లోనూ భారత్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడని గంభీర్ నొక్కి చెప్పాడు. ఈ విజయాలకు గాను యువరాజ్ మరింత క్రెడిట్ పొందేందుకు నూటికి నూరు శాతం అర్హుడని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నాడు.
2007 t20 ప్రపంచకప్ గురించి తనకు కచ్చితంగా తెలియదని కానీ 2011లో యువరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్ లభించిందని గంభీర్ చెప్పుకొచ్చాడు. అంత కీలకమైన టోర్నీలో ప్రతిష్టాత్మక అవార్డు లభించినా... యువరాజ్ పేరును ప్రపంచ కప్పు విజయాల గురించి మాట్లాడేటప్పుడు ఎవరూ ఎత్తకపోవడం దురదృష్టకరమని చెబుతూ అసహనం వ్యక్తం చేశాడు. ఇతరుల సహకారాన్ని బలహీనపరుస్తూ ఒక వ్యక్తిని అత్యుత్తమ ప్రదర్శనకారుడిగా ప్రోత్సహించే మార్కెటింగ్, PR వ్యూహాలే దీనికి కారణమని ఆయన ఆరోపణలు చేశాడు.
ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్లను గెలవడమనేది టీమ్ సమిష్టిగా కృషి చేస్తేనే సాధ్యమవుతుందని.. మొత్తం విజయానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి అని చెప్పకూడదని గంభీర్ ఉద్ఘాటించాడు. ఇండియన్ క్రికెట్లో వ్యక్తి పూజ ఉండటం వల్ల ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ ఎక్కువ విజయాలు సాధించలేకపోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు వ్యక్తిగత ఆటగాళ్ల కంటే జట్టుకు ప్రాధాన్యత ఇస్తాయని అతను ఈ సందర్భంగా వెల్లడించాడు.
1983 ప్రపంచ కప్ విన్ అయిన కపిల్ దేవ్ జట్టులో కూడా గుర్తింపు రావలసిన వారికి అది రాలేదని తెలిపాడు. ఆ టోర్నీలో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన మొహిందర్ అమర్నాథ్ ఎవరో కూడా ఇప్పటి తరం వారికి ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చాడు. దీనికి కారణం మీడియా కేవలం ఒక వ్యక్తి పైనే కాన్సన్ట్రేట్ చేయడం అని అభిప్రాయపడ్డాడు. ఒకే వ్యక్తిని పూజించే సంస్కృతిని వీడనాడాలని, మ్యాచ్‌లో గొప్పగా ఆడిన ప్రతి ఒక్కరినీ మెచ్చుకునే సంస్కృతికి అలవాటు పడాలని గంభీర్ సూచించాడు.