టీమిండియాలో ఆ ముగ్గురిని ఔట్ చేస్తే ఖతం : పాక్ మాజీ
ఆసియా కప్, ప్రపంచకప్ త్వరలోనే మొదలుకానుంది. కానీ మాజీ క్రికెటర్ల అనాలిసిస్ మాత్రం ముందే మొదలైంది. మొన్న డివిలియర్స్ ఏ జట్లు సెమిస్ కి వెళ్తాయనేది అనాలిసిస్ చేసాడు. ఇప్పుడు పాక్ మాజీ క్రికెటర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేసాడు. పాక్ మాజీ బ్యాటర్, స్పిన్నర్ బాసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పాక్ బ్యాటింగ్ లైన్ అప్ బలంగా ఉందని, భారత బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే ముఖ్యమని, వారిని అవుట్ చేస్తే చాలని ఎద్దేవా చేశారు.
ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ 2023 ప్రారంభం కానుంది. రెండు వారాల తరువాత వన్డే ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో భారత్, పాకిస్తాన్ జట్ల బలాబలాల గురించి తన యూట్యూబ్ చానెల్ వేదికగా బాసిత్ అలీ మాట్లాడారు. భారత్ బ్యాటింగ్ లైన్ అప్ కంటే పాక్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉందని, భారత్ బ్యాటింగ్ శుబ్ మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మీదే ఆధారపడి ఉందని తెలిపాడు. అయితే ఈ ముగ్గురు రాణిస్తే మాత్రం ఆసియా కప్ మాత్రమే కాదు ప్రపంచకప్ కూడా ఇండియా ఈజీగా గెలుస్తుందని, లేదంటే భారత్‌ను ఓడించడం పాకిస్తాన్ జట్టుకు పెద్ద కష్టం కాబోదని జోస్యం చెప్పారు.
పాక్ జట్టు బ్యాటింగ్ లైనప్ లో బాబర్ ఆజామ్, ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, మహమ్మద్ రిజ్వాన్‌లతో కూడిన పాక్ టాపార్డర్ ఎంత బలంగా ఉంది. వీరితో పాటు ఇఫ్తికర్, సల్మాన్ అలీ, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్‌లతో మిడిలార్డర్‌తో పాటు లోయరార్డర్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు ఇండియా మిడిల్ ఆర్డర్ తో పోలిస్తే పాక్ మిడిల్ ఆర్డర్ చాలా బలంగా ఉందని చెప్పుకొచ్చారు.
బాసిత్ అలీ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు మాటలతో ప్రశ్నలు అడిగితే భారత బ్యాటర్లు బ్యాట్ తో సమాధానం చెబుతారని కామెంట్లు పెడుతున్నారు.