బంతి వికెట్లను తాకిన ఎంపైర్ నాటౌట్.. షాకైన ప్లేయర్స్.. వీడియో వైరల్?

praveen
బిగ్ క్రికెట్ లీగ్ టీ20 టోర్నీలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకోవడం ఇపుడు సర్వత్రా హాట్ టాపిక్ అయింది. విషయం ఏమిటంటే, బౌలర్ వేసిన బంతి వికెట్లను తాకినప్పటికీ బెయిల్స్ కింద పడలేదు. ఈ క్రమంలో వికెట్ పక్కకు జరిగినప్పటికీ, బెయిల్స్ ఎగిరి వికెట్లపైనే పడడం కొసమెరుపు. ఇలాంటివి క్రికెట్లో చాలా అరుదైన దృశ్యాలుగా మిగిలిపోతాయి. దాంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ తరుణంలో ఈ టోర్నీ అధికారిక బ్రాడ్‌కాస్టర్ అయినటువంటి ఫ్యాన్ కోడ్.. ఈ వీడియోను షేర్ చేసి మరీ ఔటా?నాటౌటా? అని అభిమానులను ప్రశ్నించింది. దాంతో సదరు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
విషయంలోకి వెళితే... మధ్య ప్రదేశ్ టైగర్స్ వర్సెస్ యూపీ బ్రిజ్‌స్టార్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత దేశవాళీ క్రికెటర్ పవన్ నేగీ వేసిన బౌలింగ్‌లో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో యూపీ బ్రిజ్‌స్టార్స్‌ కెప్టెన్ చిరాగ్ గాంధీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో మధ్యప్రదేశ్ టైగర్స్ ఆటగాళ్లు చాలా ఖుషీ అయిపోయారు. కట్ చేస్తే... బెయిల్స్ వారికి బిగ్ షాక్ ఇచ్చాయి. వికెట్ జరిగినా.. బెయిల్స్ కిందపడకపోవడంతో అంపైర్ నాటౌటిచ్చాడు. అవును, ఐసీసీ రూల్స్ ప్రకారం అయితే బెయిల్స్ కిందపడితేనే క్లీన్ బౌల్డ్ అయినట్లు. కానీ అలా జరగకపోవడంతో అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఇక దీనిని అవకాశంగా తీసుకున్న చిరాగ్ గాంధీ చెలరేగి మరీ ఆడడం జరిగింది. కట్ చేస్తే, మనోడు 58 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101 నాటౌట్ గా మిగిలాడు.
అయితే చిరాగ్ గాంధీ కష్టం మట్టిలో పోసిన పన్నీరు అయిపోయింది. ఎందుకంటే, తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ టైగర్స్ 71 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 239 పరుగులు చేసింది. సాకేత్ శర్మ(101) శతకంతో చెలరేగి అడగా, పవన్ నేగి(87 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తరువాత యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. చిరాగ్ గాంధీ(101 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగినా ఫలితం దక్కలేదు మరి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: