BGT 2-2 తో సమం అయితే.. ఇండియా WTC ఫైనల్ వెళ్తుందా?
వివరాల్లోకి వెళితే... గబ్బా టెస్టు మ్యాచ్ డ్రా అయిన యెడల భారత్, ఆస్ట్రేలియాలకు చెరో 4 పాయింట్లు లభిస్తాయి. తద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో టీమిండియా పాయింట్లు 114 పాయింట్లకు చేరుకుంటాయి. అదే క్రమంలో భారత్ విజయాల శాతం 55.88 శాతానికి పడిపోతుంది. దీంతో భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఆసీస్ గెలుపు శాతం 58.88గా ఉండి రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక 63.33 విజయాల శాతంతో దక్షిణాఫ్రికా అయితే అగ్రస్థానంలో తన ఉనికిని చాటుకుంటుంది. గబ్బా టెస్టు డ్రా అయితే భారత్‌కు వచ్చే 2 మ్యాచ్‌ల్లో విజయం తప్ప మరో మార్గం ఉండదు. ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడినా కూడా ఫైనల్ అవకాశాలు అయితే ఒకింత సంక్లిష్టంగా మారక తప్పదు!
అదే సమయంలో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోవాలంటే భారత్ చివరి 2 మ్యాచ్‌ల్లో కచ్చితంగా విజయం సాధించి తీరాల్సిందే. లేకుంటే డబ్ల్యూటీసీలో భారత్ టాప్-2కు చేరుకోవడం చాలా కష్టతరం అని విశ్లేషకులు అంటున్నారు. దక్షిణాఫ్రికా చివరి 2 టెస్టు మ్యాచ్‌లు పాకిస్థాన్‌తో జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లలో ఒకదానిలో విజయం సాధిస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చోటు దక్కించుకోవడం మాత్రం ఖాయం. అయితే 2 మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూస్తే మాత్రం టీమిండియా తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే. భారత్ తర్వాత శ్రీలంకతో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ శ్రీలంక గెలిస్తే భారత్‌కు ఫైనల్ అవకాశాలు మెరుగుపడతాయి అని తెలుస్తోంది.