టీమిండియాకు అన్యాయం.. మనోళ్లకు ఓల్డ్ పిచ్‌లు, ఆస్ట్రేలియాకు కొత్త పిచ్‌లా?
భారత్-ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అసలుసిసలైన మజా ఇప్పుడే మొదలైంది. ఐదు టెస్టుల ఈ పోరులో ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. దీంతో డిసెంబర్ 26న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరగబోయే నాలుగో టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్‌కి మనవాళ్లకు ఓల్డ్ పిచ్‌లు, ఆస్ట్రేలియాలకి కొత్త పిచ్‌లు ఇచ్చారని చర్చ మొదలయ్యింది. దీనిపై క్యూరేటార్ స్పందించారు.
టీమిండియా పెర్త్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి సిరీస్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. కానీ, ఆ జోరును అడిలైడ్‌లో కొనసాగించలేకపోయింది. డే-నైట్ టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇక బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్ మరింత రసవత్తరంగా మారింది. ఒక్కో పిచ్ ఒక్కోలా ఉండటంతో మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగుతున్నాయి. పెర్త్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామంలా బౌన్సీగా ఉంటే, అడిలైడ్ పిచ్ పింక్ బాల్ స్వింగ్‌కు అనుకూలించింది. బ్రిస్బేన్ పిచ్ కూడా ఫాస్ట్, బౌన్సీ కండిషన్స్‌తో బౌలర్లకు సహకరించింది. ఇప్పుడు అందరి కళ్లు మెల్‌బోర్న్‌లోని చారిత్రాత్మక MCG పిచ్‌పై ఉన్నాయి.
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) పిచ్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు అక్కడి క్యూరేటర్ మాట్ పేజ్. పిచ్ ఎలా ఉండబోతోంది, బ్యాట్స్‌మెన్‌కు అనుకూలిస్తుందా లేక బౌలర్లు విజృంభిస్తారా అనే ఉత్కంఠకు తెర దించుతూ ఆయన పలు విషయాలు పంచుకున్నారు. గత కొన్నేళ్లుగా MCG పిచ్‌లు అద్భుతంగా ఉంటున్నాయని, వాటి నాణ్యత తమను ఎంతగానో సంతృప్తి పరిచిందని పేజ్ తెలిపారు. మ్యాచ్ కి సరిగ్గా మూడు రోజుల ముందు కొత్త పిచ్ రెడీ అవుతుందని, ఇండియా ట్రైనింగ్ సెషన్ చాలా ముందుగానే ప్రారంభం కానందుని, అది కలిసి వస్తుందని అన్నారు.
"పిచ్‌పై కాస్త గడ్డి ఉంటే మ్యాచ్ మరింత రసవత్తరంగా ఉంటుందని ఏడేళ్ల క్రితం మేం ఒక నిర్ణయం తీసుకున్నాం. బౌలర్లకు ప్రోత్సాహం అందించడంతో పాటు, కొత్త బంతి పాతబడ్డాక బ్యాటింగ్‌కు కూడా అనుకూలించేలా పిచ్‌ను తయారు చేస్తున్నాం. అందుకే పిచ్‌పై 6 మిల్లీమీటర్ల మేర గడ్డి ఉంచుతున్నాం" అని పేజ్ వివరించారు. స్పిన్నర్లకు మాత్రం ఈ పిచ్ పెద్దగా సహకరించకపోవచ్చని, గత కొన్నేళ్లుగా సీమ్ బౌలర్లే ఇక్కడ ఆధిపత్యం చెలాయించారని ఆయన అన్నారు. ఇక వాతావరణం విషయానికొస్తే, మెల్‌బోర్న్ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేమని, ఒకవేళ వేడిగా ఉంటే పిచ్ మరింత వేగంగా స్పందించే అవకాశం ఉందని, పరిస్థితులకు తగ్గట్టు పిచ్‌ను సిద్ధం చేస్తామని పేజ్ తెలిపారు.
ఆస్ట్రేలియా పిచ్‌ల ప్రత్యేకతను పేజ్ వివరించారు. పెర్త్ వేగం, బౌన్స్‌కు ప్రసిద్ధి, అడిలైడ్ పింక్ బాల్ స్వింగ్‌కు, గబ్బా వేగవంతమైన, బౌన్సీ పరిస్థితులకు పేరుగాంచాయి. అయితే, మెల్‌బోర్న్ పెర్త్ లేదా బ్రిస్బేన్ అంత కాకుండా, వేగం, బౌన్స్‌తో సమతుల్య పిచ్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఆస్ట్రేలియాలోని ప్రతి వేదికకు దాని స్వంత ప్రత్యేకత ఉంది, ఇది ఆస్ట్రేలియన్ క్రికెట్‌ను ప్రత్యేకంగా చేస్తుంది. భారత్ ఇటీవల బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లలో బలమైన రికార్డును కలిగి ఉంది, 2018-19 మరియు 2020-21లో ఆస్ట్రేలియాలో గెలిచింది. ఇప్పుడు, రోహిత్ శర్మ నాయకత్వంలో, వారు ఆస్ట్రేలియాలో వరుసగా మూడవ సిరీస్ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.