చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో కనిపెట్టిన నాసా...!
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గతంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని గట్టిగా ఢీ కొట్టిందని ప్రకటన చేసింది. కానీ చంద్రుడిపై ల్యాండర్ ఉన్న ప్రాంతాన్ని మాత్రం గుర్తించలేకపోయింది. తాజాగా నాసా చందమామపై విక్రమ్ ల్యాండర్ ను కనిపెట్టింది. నాసా ల్యాండర్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
నాసాకు చెందిన ల్యూనార్ రికోన్నైస్సాన్ ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్ ను గుర్తించింది. నాసా విక్రమ్ ల్యాండర్ కూలిన తరువాత ల్యాండర్ శకలాలు కొన్ని చిందరవందరగా పడినట్లు తెలిపింది. మొత్తం 24 చోట్ల శకలాలు పడినట్లు నాసా గుర్తించింది. సెప్టెంబర్ నెల 7వ తేదీన చంద్రుడిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ కు గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయాయి. ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్ ను కనిపెట్టేందుకు తీవ్రంగా కృషి చేశారు.
నాసాకు చెందిన ల్యూనార్ రికోన్నైస్సాన్ ఆర్బిటర్ విక్రమ్ శకలాల వలన ప్రభావితమైన ప్రదేశాలను స్పష్టంగా గుర్తించింది. నాసా షణ్ముగ సుబ్రహ్మణియన్ అనే వ్యక్తి విక్రమ్ కు సంబంధించిన తొలి శకలాన్ని కనుగొన్నట్లు ప్రకటించింది. నిజానికి విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ కొరకు నాసా గుర్తించిన ప్రాంతాన్ని ల్యూనార్ రికోన్నైస్సాన్ ఆర్బిటర్ సెప్టెంబర్ 17వ తేదీనే గుర్తించింది.
కానీ ఆ ప్రాంతంలో చీకటిగా ఉండటంతో ల్యాండర్ ను ఖచ్చితంగా గుర్తించలేకపోయింది. మరిన్ని పరిశోధనలు చేసి విక్రమ్ శకలాలే అని నిర్ధారించుకొని తాజాగా చిత్రాలు, వివరాలను వెల్లడించింది. నాసా సాఫ్ట్ వేర్ సమస్య వలనే ల్యాండింగ్ లో లోపం జరిగిందని గుర్తించింది. ల్యూనార్ రికోన్నైస్సాన్ ఆర్బిటర్ తీసిన ఫోటోలో నీలి రంగులో ఉన్న చుక్కలు విక్రమ్ వలన ప్రభావితమైన చంద్రుడి ఉపరితలాన్ని, ఆకుపచ్చ రంగులో ఉన్న చుక్కలు విక్రమ్ శకలాల్ని సూచిస్తున్నాయి. S లెటర్ లో సూచించిన శకలం షణ్ముగ సుబ్రహ్మణియన్ కనిపెట్టిన శకలం అని నాసా తెలిపింది.