ఆధార్ కార్డు ని అప్డేట్ చేయాలనుకుంటున్నారా ఐతే ఇలా చేయండి .....
మన దేశంలో నివసించే వారికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో చెప్పవలసిన అవసరం లేదు. కీలకమైన డాక్యుమెంట్లలో ఇది కూడా ఒకటి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందటంలో, అధిక విలువ కలిగిన లావాదేవీలు జరపటానికి, ఐటీఆర్ దాఖలు చేయటానికి, గుర్తింపు కార్డుగా, అడ్రస్ ప్రూఫ్ గా ఆధార్ కార్డు కీలక పాత్ర పోషిస్తుంది.
కానీ కొందరు ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉండటం మూలాన ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. ఆధార్ కార్డు నమోదు సమయంలోనే కొందరి వివరాలు తప్పుగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. వాటిని సరి చేసుకోవటానికి రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటేమో ఆన్లైన్ ప్రాసెస్, రెండోది ఆధార్ కేంద్రానికి వెళ్లి సరి చేసుకోవటం. యూఐడీఏఐ సర్క్యూలర్ ప్రకారం.. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, పేరు, అడ్రస్, జెండర్,ఫోటో లేదా ఫింగర్‌ప్రింట్స్ వంటి వివరాలను అప్డేట్ చేసుకోవాలంటే రూ.50 చెల్లించాలి.
పేరు, జెండర్, పుట్టినతేదీ లాంటి వివరాలను ఆధార్ కార్డులో ఎక్కువసార్లు మార్చుకోవటం కుదరదు. ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఈ వివరాలను మార్చుకునే వీలు ఉంటుంది. కొన్ని వివరాలను ఆధార్ కార్డులో ఎన్నిసార్లైనా మార్చుకునే వీలు ఉంటుంది. నిర్దేశిత చార్జీలను చెల్లించి ఆధార్ కార్డులోని వివరాలను మార్చుకోవచ్చు. దీని కోసం మన మొబైల్ నంబర్ ఆధార్ కార్డుకు ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. అలా అయ్యి ఉంటే మాత్రమే ఓటీపీ ద్వారా ఆధార్ కార్డులోని వ్యక్తిగత వివరాలను మార్చుకునే అవకాశం ఉంటుంది.
కానీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డు తో లింక్ అవ్వకుంటే మాత్రం ఆధార్ కేంద్రానికి వెళితే మాత్రమే అప్ డేట్ చేసుకోవచ్చు. ఆధార్ అప్ డేట్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి ఆధార్ సెంటర్ లో అందించాలి. మొబైల్ నంబర్ అప్ డేట్ కావడానికి ఏడు నుండి పది రోజుల సమయం పడుతుంది. మొబైల్ నంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే యూఐడీఏఐ వెబ్ సైట్ లోకి వెళ్లి ఆధార్ సర్వీసెస్ క్లిక్ చేసి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి లింక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు.