గూగుల్ పే కస్టమర్లకు షాకింగ్ న్యూస్... వెలుగులోకి కొత్త మోసం...?
ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫిర్యాదుతో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. మోసపోయిన యువతి కానిస్టేబుల్ కావడం గమనార్హం. హైదరాబాద్ కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ వివాహ అవసరాల కోసం బ్యాంకులో డబ్బు దాచుకుంది. పెళ్లి ఫిక్స్ కావడంతో బ్యాంకులో నగదు విత్ డ్రా చేయాలని వెళ్లగా అకౌంట్లో నగదు లేకపోవడంతో యువతి షాక్ కు గురైంది.
యూసఫ్ గూడ ప్రాంతంలో కానిస్టేబుల్ గా పని చేసే ఒక యువతికి ఆంధ్రా బ్యాంక్ తో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాలు ఉన్నాయి. గూగుల్ పే లో ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ ను ఆమె లింక్ చేసుకున్నారు. ఆ అకౌంట్ కు బెనిఫిషియరీగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా జత చేసుకున్నారు. గత నెలలో ఆంధ్ర బ్యాంకులో ఉన్న 90,000 రూపాయల నగదును బదిలీ చేశారు. నగదు మాయం కావడంతో పోలీసులను ఆశ్రయించగా గూగుల్ పే ద్వారా యువతి మోసపోయిందని తేలింది.
సైబర్ మోసగాళ్లు యువతి బేనిఫిషియరీ ఖాతాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాను డిలేట్ చేసి వారి ఎస్బీఐ ఖాతాను యాడ్ చేశారు. ఈ విషయం తెలియని యువతి ఎస్బీఐ ఖాతాకు 90,000 రూపాయలు బదిలీ చేసింది. యువతి డిపాజిట్ చేసిన ఖాతా డమ్మీ అకౌంట్ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.