ఓటర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఎక్కడికి వెళ్తే అక్కడే..

P.Phanindra
న్యూఢిల్లీ: దేశంలో 18 ఏళ్లు పైబడి కూడా ఓటర్ కార్డు లేని వ్యక్తి ఉంటారేమో కాని ఆధార్ కార్డు లేని వారు మాత్రం ఉండరు. అంతలా ఆధార్ కార్డు విప్లవాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఏ పని చేయాలన్నా కాని ప్రస్తుతం ఆధార్ తప్పనిసరి. ఆధార్ లేదంటే ఎన్నో పనులు ఆగిపోతాయి. అంతలా ఆధార్ కార్డు మన జీవితాల్లో భాగమైపోయింది. ఇక ఆధార్ విషయాన్ని పక్కన పెడితే దేశంలో చాలా మంది వద్ద ఓటరు కార్డు అనేది లేదు. ఆధార్ కార్డు నిత్యం ఉపయోగపడుతుంది కాబట్టి దాని అవసరం ఎక్కువ కనుక ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ తప్పనిసరిగా ఉంటోంది. మరి ఓటర్ కార్డు మాత్రం ఐదేళ్లకు ఒక్కసారి మాత్రమే ఉపయోగపడుతుంది. కేవలం ఎన్నికలప్పుడు ఓటు వేసేందుకు తప్ప ఆ తర్వాత దాని అవసరం పెద్దగా రాదు. అయితే చాలా మంది తమ ఓటర్ కార్డు కోసం అనేక చోట్లకు తిరుగుతూ ఉంటారు కానీ వెంటనే పని అవ్వదు. పోనీ ఆధార్ లాగా ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకుందామన్నా కూడా ఆ అవకాశం లేదు.

దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆధార్ కార్డును ఏ విధంగా అయితే డిజిటలైజ్ చేశారో ఓటర్ ఐడీలను కూడా అదే విధంగా డిజిటలైజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. 2021లో దేశంలోని ఐదు రాష్ట్రాలు.. తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే నాటికి ఓటర్ కార్డును డిజిటలైజ్ చేసేయాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. డిజిటలైజ్ చేయడం వల్ల సదరు ఓటరు ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో తన ఓటరు గుర్తింపు కార్డును డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా ఓటరు కార్డును దరఖాస్తు చేసుకునే వారికి ఆటో‌మేటిక్‌గానే డిజిటలైజ్ అయిపోనుంది. వారి ఫోన్ నెంబరును ఓటరు కార్డును లింక్ చేయడంతో వారి ఓటరు కార్డు డిజిటలైజ్ కానుంది.

ఇక గతంలో ఓటరు గుర్తింపు కార్డును తీసుకున్న వారు కూడా ఆన్‌లైన్ ఓటర్ యాప్ ద్వారా తమ ఓటరు కార్డును ఆన్‌లైన్ చేసుకునే అవకాశం రానుంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వస్తున్న సమాచారం బట్టి చూస్తే.. ఎపిక్ ఐడీకి రెండు క్యూఆర్ కోడ్‌లు ఉండనున్నట్టు సమాచారం. ఈ రెండు క్యూ ఆర్ కోడుల్లో ఒకటి ఓటరుకు సంబంధించిన సమాచారం కాగా. మరో క్యూ ఆర్ కోడ్‌లో మిగిలిన సమాచారం ఉండనుంది. ఓటరు కార్డు డిజిటలైజ్ అయితే విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తమ ఓటరు కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. డిజిటలైజ్ అవ్వడం ద్వారా అడ్రస్ మారినా వెంటనే కొత్త అడ్రస్‌తో మరో ఓటరు కార్డును తక్కువ సమయంలో పొందే సౌలభ్యం ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: