తెలంగాణ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

P.Phanindra
హైదరాబాద్: టెక్నాలజీ విస్తరిస్తూ పోతుండటంతో ప్రస్తుతం ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యవసరాలలో ఒకటిగా మారిపోయింది. సిటీలలో జీవిస్తున్న వారికి ఇంటర్నెట్ విషయంలో పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న ప్రజలకు మాత్రం ఇప్పటికి అనుకున్న స్థాయిలో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించలేకపోతున్నారు. ఈ ఇబ్బందులను తొలగించడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలోని 33 జిల్లాలు, 585 మండలాలు, 12,751 గ్రామ పంచాయతీల్లోని 83.5 లక్షల గృహాలకు హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే రెండేళ్లలోనే ఈ అన్ని ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లను అందజేయాలని చూస్తోంది. దీనికోసం ప్రభుత్వం రూ.2000 కోట్లను కేటాయించింది. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుగా దీనికి నామకరణం చేసి త్వరతగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

టెండర్లు పూర్తి చేసి కేబుల్‌ వేసే బాధ్యతను ఎల్ అండ్ టీ సంస్థ స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌, ఈసీఐఎల్‌కు అప్పగించింది. కేబుల్‌ను భూగర్భంలో, స్తంభాల ద్వారా వేయనున్నారు. రాష్ట్ర హెడ్‌క్వార్టర్స్‌ నుంచి జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు, గ్రామాలు, ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ఏ ఒక్క ప్రదేశాన్ని వదలకుండా కేబుల్ వేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎక్కడా ఏ పొరపాటు జరగకుండా నెట్‌వర్క్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ను ఇప్పటికే ఏర్పాటు చేశారు. పీఎల్‌బీ హెచ్‌డీఎఫ్ఈ పైపుల ద్వారా ఓఎఫ్‌సీని 38 వేల కిలోమీటర్ల పొడవున వేసేందుకు నిర్ణయించరు. ఇక ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ కోసం భూసంబంధిత ఇబ్బందులు తలెత్తకుండా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సోమవారం రైట్‌ ఆఫ్‌ వే ఉత్తర్వులను సైతం జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే కేబుల్‌ వేసే వెసులుబాటును రైట్‌ ఆఫ్‌ వే కింద ప్రభుత్వం కార్పొరేషన్‌కు కల్పించింది. ఏరియల్‌ కేబుల్‌కు సంబంధించి విద్యుత్తు సంస్థలకు కూడా ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలియజేసింది. విద్యుత్‌ సంస్థలకు చెందిన స్తంభాలు, సబ్‌స్టేషన్లను అనుమతి తీసుకోకుండానే వాడుకోవచ్చని ప్రకటించింది. మిషన్‌ భగీరథ పైపులైను దారిలో 18 వేల కిలో మీటర్ల మేర కేబుల్‌ను, స్టేట్‌ హెడ్‌క్వార్టర్‌ నుంచి మండలాలు, గ్రామపంచాయతీలకు 20 వేల కిలోమీటర్ల కేబుల్‌ను అధికారులు వేనున్నారు. ఇక మరో 50 వేల కిలో మీటర్ల కేబుల్‌ను రెండో దశలో భాగంగా గ్రామ పంచాయతీల నుంచి గృహాలకు వేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: