బుల్లిపిట్ట : మీ కారు ను ఎక్కువ రోజులు బయటకు తీయడం లేదా. అయితే ఇది మీ కోసమే..!
ఇప్పుడున్న సమాజంలో బయటకు వెళ్లాలంటే చాలు తప్పకుండా ఒక కారుని అయితే మెయింటెన్ చేయక తప్పదు . ఇక అందుకోసమే గత కొన్నాళ్లుగా కొత్త కార్లు కొనుగోలు భారీగా పెరిగాయి. వాహనాలను తరచుగా నడిపితేనే వాటి పనితీరు సక్రమంగా ఉంటుంది. కానీ కరోనా కారణంగా సంవత్సరం నుండి లాక్ డౌన్ వల్ల వాహనాలు ఎక్కువ రోజులు ఇళ్లకే పరిమితం అవుతున్నాయి. ఇక ప్రైవేట్ కార్పొరేషన్లో ఉద్యోగం చేసేవారు ఇంటి నుంచే పని చేస్తుండడంతో కార్లు రోడ్డుమీదికి రావట్లేదు. ఫలితంగా వాటి నిర్వహణ సక్రమంగా లేక ఇంజన్ పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎలుకలు చేరడం, కొన్ని సామాన్లు తుప్పు పట్టడం, బ్యాటరీ దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురు కావచ్చు. వీటికి దూరంగా ఉండటానికి కొన్ని చిట్కాలను పాటించాలి అని మోటర్ వాహన నిపుణులు చెబుతున్నారు.
కనీసం వారంలో ఒక్కరోజైనా కార్లను బయటకు తీయాలి. అలా కారును తీయడం వల్ల బ్రేక్ డిస్కులు, కాలిపర్లు వంటి భాగాలు తుప్పు పడకుండా ఉంటాయి. అందుకే వారానికి ఒక్కసారైనా డ్రైవ్ కు వెళ్లడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇందుకు మీకు సమయం లేకపోతే కారును స్టార్ట్ చేసి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలి. కారు ఇంజన్ తో పాటు, విండోలు, ఏసీ ఇన్ఫో నైట్ మెంట్ సిస్టం ని ఆన్ చేసి ఉంచాలి.
కార్లు టైర్లు మెయింటైన్ సరిగా ఉందో లేదో సరిచూసుకోవాలి. ఎక్కువ రోజులు కారు బయటకు తీయకపోతే టైర్ లో ఉండే గాలి పోయే అవకాశం చాలా ఉంది. ఫలితంగా కారు బరువు టైర్ల మీద పడి అవి దెబ్బతింటాయి. అందుకే కార్ల టైర్లలో ఎప్పుడూ గాలి ఉండేలా చూసుకోవాలి.
ఎక్కువ రోజులు కార్ ను కదపకుండా ఉంచితే కారులో ఎలుకలు చేరే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కార్లలో ఉండే వైరింగ్ ను కొరికేస్తాయి. ఇలా చేయడం వల్ల వాహనాల్లోని వివిధ వ్యవస్థలు పనిచేయకుండా పోతాయి. అందుకే వాహనంలోకి ఎలుకలు రాకుండా పిప్పర్మెంట్ ఆయిల్, మౌస్ ట్రాప్ లు ఉంచాలి.
కారు ఇంజన్ లోపలి భాగాలను ఇంజన్ ఆయిల్ సంరక్షిస్తుంది. అలాంటి ఆయిల్ ను మనం ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. కనీసం 90 రోజుల తర్వాత అయినా దీన్ని మార్చాలని నిపుణులు చెబుతున్నారు.కారుని కనీసం వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల సీట్ల పై ఉండే మురికి తొలగిపోతుంది. దీనివల్ల దుర్వాసన రాకుండా ఉంటుంది.
ఇంట్లో పార్కింగ్ ప్లేస్ లేని వారు వేరే ప్రాంతాల్లో కార్ పార్కింగ్ చేసేటప్పుడు, నీడలోనే వాహనాలను పార్కింగ్ చేయాలి. ఎక్కువ రోజులు ఎండ ప్రభావానికి గురికావడం వల్ల కారు రంగు పోయే అవకాశం చాలా ఉంది. అలాంటప్పుడు ప్రొటెక్షన్ కవర్ తో కప్పి ఉంచాలి.
ఎక్కువరోజులు వాహనాలకు హ్యాండ్ బ్రేక్ వేసి ఉంచడం మంచిది కాదు. దీనివల్ల అవి పాడవుతాయి ఫలితంగా బ్రేకింగ్ సిస్టమ్ దెబ్బతింటుంది.
అయితే చూసారు కదా ఫ్రెండ్స్..! మీకు కూడా కారు ఉంటే ఇలాంటివి పాటించండి.