వాట్సప్ అప్లికేషన్ లో మల్టీ డివైస్ సపోర్ట్ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఇప్పటికే వాట్సాప్ వెబ్ బీటా వెర్షన్ లో మల్టీ డివైస్ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా మల్టీ డివైస్ ఫీచర్ సక్రమంగా పని చేస్తుందా లేదా అని టెస్ట్ చేస్తున్నారు. అయితే వినియోగదారులు మాత్రం ఈ ఫీచర్ ని ప్రస్తుతానికైతే ఉపయోగించుకోలేరు. వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో లో మల్టీ డివైస్ ఫీచర్ కి సంబంధించి ఒక స్క్రీన్ షార్ట్ షేర్ చేశారు. దీనితో పాటు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.
“మీ ఫోన్‌ను ఇంటర్నెట్ కి కనెక్ట్ చేయకుండా కాల్స్ చేయండి, టెక్స్ట్ మెస్సేజ్లు పంపండి. ఒకేసారి 4 డివైస్ లలో వాట్సాప్ ఉపయోగించండి," అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం వాట్సాప్ వెబ్ ద్వారా మెసేజెస్ పంపించవచ్చు కానీ ఫోన్‌ను కనెక్ట్ చేయకుండా మెసేజెస్ పంపించడం సాధ్యపడదు. ఐతే త్వరలోనే తీసుకొస్తున్న సరికొత్త ఫీచర్ తో ఫోన్‌ను కనెక్ట్ చేయకుండా మెసేజెస్ పంపించవచ్చు. అయితే లాగిన్ ప్రక్రియ యధావిధిగా ఉండనుందని ఈ ప్రకటన స్పష్టం చేసింది. క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి వెబ్ వెర్షన్ యాక్సెస్ చేయొచ్చు.
ఇకపోతే వాట్సాప్ మల్టీ-డివైస్ సపోర్ట్ యొక్క ఫంక్షనల్ వెర్షన్ త్వరలో బీటా వెర్షన్‌లో విడుదల కానుంది. అప్పుడు యూజర్లు మల్టీ-డివైస్ సపోర్ట్ ఫీచర్ ని వినియోగించుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు తమ డివైసెస్, స్మార్ట్‌ఫోన్‌లలో లేటెస్ట్ వాట్సాప్ అప్లికేషన్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ నెల లోపు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ చీఫ్ విల్ క్యాత్‌కార్ట్, మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా ప్రకటించారు. ఐతే మొదటి దశలో స్మార్ట్ ఫోన్, వాట్సాప్ వెబ్, వాట్సాప్ డెస్క్‌టాప్, ఫేస్ బుక్ పోర్టల్ లో మాత్రమే మల్టీ-డివైస్ ఫీచర్ పనిచేస్తుంది. అనగా ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సప్ అప్లికేషన్ పని చేయదు.