ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ ఉండి తీరుతుంది. ముఖ్యంగా చాలా మంది యువత చేతిలో మనకు స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. రెండు రోజుల వరకు తిండి లేకుండానైనా నేటి తరం యువత ఉంటారేమో కానీ ఒక గంట సేపు చేతిలో ఫోన్ లేకుంటే మాత్రం ఉండలేరు. అంతలా స్మార్ట్ ఫోన్లకు బానిసల్లా మారిపోయారు. ఈ స్మార్ట్ ఫోన్లతో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో అంతే రేంజ్ లో చెడు ప్రభావాలు కూడా ఉంటాయి. ఫోన్లు వాడడం వలన మనిషిలో ఎక్కువగా కంటి, మెదడు సంబంధిత సమస్యలు వస్తాయి. అయినప్పటికీ నేటి యుగంలో ఫోన్ లేకుండా బతకలేమనే స్థితికి మనం చేరుకున్నాం. ఫోన్ తో మనకు ఉన్న అవసరం కన్నా ఎక్కువగా మనలో చాలా మంది ఫోన్లు వాడుతూ కనిపిస్తారు.
ఇదే అదనుగా చాలా రకాల మొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశాయి. వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లతో ఫోన్లను విడుదల చేస్తూ తమ వినియోగదారుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాయి. అలా ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల మార్కెట్ లో అగ్రగామి సంస్థగా కొనసాగుతున్న శాంసంగ్ కంపెనీ నుంచి త్వరలో ఫోల్డబుల్ ఫోన్లు వస్తాయనే ప్రకటనతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శాంసంగ్ కంపెనీ తయారు చేసిన ఈ రెండు మడత పెట్టే ఫోన్ల మోడల్స్ ను ఆగస్టు 11న మార్కెట్ లోకి విడుదల చేయనుంది. అయితే ఈ రెండు ఫోల్డబుల్ ఫోన్లతో పాటుగా కొన్ని రకాల విడిపరికరాలను కూడా సంస్థ విడుదల చేస్తుంది. ఇప్పుడంటే ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చాయి కానీ వీటికంటే ముందు శాంసంగ్ కంపెనీలో మడత పెట్టే ఫోన్లు అందుబాటులో ఉండేవి. కానీ పాత ఫోల్డబుల్ ఫోన్లకు ప్రస్తుతం కంపెనీ రిలీజ్ చేయబోయే ఫోల్డబుల్ ఫోన్లకు ధర విషయంలో తేడా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.