గత కొద్దిరోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న టువంటి వర్షాలతో వాగులు వంకలు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీంతో ప్రభుత్వం సహాయక చర్యలు అందిస్తూనే ముంపు ప్రాంతాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
దక్షిణ అండమాన్ ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. తర్వాత 48 గంటల్లో అల్పపీడనం బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. మరోవైపు శ్రీలంక తీరప్రాంతం పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల రాగల రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. ప్రకాశం,నెల్లూరు, చిత్తూరు, కడప,అనంతపురం జిల్లాలో 7 సెం.మీ. నుంచి 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని గుంటూరు,కర్నూలు జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఆ సమయంలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు అవకాశం ఉందని డిసెంబర్ 1 వరకు మత్స్యకారులు సముద్రానికి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. మరోవైపు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది.
ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, సంఘం కురిసిన భారీ వర్షానికి వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. మళ్లీ కురుస్తున్న వర్షాలకు పెన్నానది కూడా పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కడప జిల్లాలోని చెరువులన్ని నిండుకుండలా మారాయి. చెరువుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు శాఖ, రెవెన్యూ,అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కడప తిరుపతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురం,కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా గుంటూరు జిల్లాలో ఈరోజు, రేపు అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.