కొరియన్ కార్ బ్రాండ్ అయిన కియా మోటార్స్ ఇండియాలో సేల్స్ పరంగా మరో అరుదైన రికార్డు సాధించింది. కియా కంపెనీ ఇప్పటి వరకూ భారతదేశంలోనే అత్యధిక నెలవారీ విక్రయాలను సెప్టెంబర్ 2022 నెలలో రిజిస్టర్ చేసింది.గడచిన నెలలో కియా కంపెనీ ఇండియన్ మార్కెట్లో మొత్తం 25,857 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ప్రస్తుతం, కియా ఇండియా తన ప్రోడక్ట్ లైనప్‌లో కియా సోనెట్, కియా సెల్టోస్, కియా కారెన్స్, కియా కార్నివాల్ ఇంకా అలాగే కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తోంది.గతేడాది ఇదే సమయంలో (సెప్టెంబర్ 2021 నెలలో) కియా ఇండియా కేవలం 14,441 యూనిట్ల వాహనాలను మాత్రమే సేల్ చేయగలిగింది. అయితే గత నెలలో అమ్మకాలు వీటికి అదనంగా 11,416 యూనిట్లు పెరిగి, 79 శాతం వృద్ధిని సాధించాయి. ఇక నెలవారీ అమ్మకాలను గమనిస్తే, గడచిన ఆగస్ట్ 2022 నెలలో కియా అమ్మకాలు 22,322 యూనిట్లుగా ఉంటే, గత నెలలో ఇవి 3,535 యూనిట్లు పెరిగి 15.84 శాతం నెలవారీ వృద్ధిని సాధించాయి. కొత్తగా వచ్చిన కారెన్స్, ఈవీ6 మోడళ్లు కియా అమ్మకాల పెరుగదలలో కీలకంగా వ్యవహరించాయి.అదే సమయంలో కియా సెల్టోస్ ఇంకా అలాగే సోనెట్ కార్లు కూడా జోరుగానే అమ్ముడయ్యాయి.
గత నెలలో అత్యధికంగా కియా సెల్టోస్ 11,000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా, సోనెట్ విక్రయాలు 9,291 యూనిట్లు ఇంకా కారెన్స్ అమ్మకాలు 5,233 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కియా కార్నివాల్ అమ్మకాలు కేవలం 404 యూనిట్లుగా మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది మూడవ త్రైమాసికం నాటికి కంపెనీ మొత్తం అమ్మకాలు 70,201 యూననిట్లుగా నివేదించబడ్డాయి.కియా ఇండియా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో సెల్టోస్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, సోనెట్ ద్వితీయ స్థానంలో ఉంది. కియా సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కొత్తగా వచ్చిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఇంకా టాటా హారియర్ వంటి మోడళ్లకు గట్టిగా పోటీగా నిలుస్తుంది. కాగా, కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్ వంటి మోడళ్లకు పోటీగా ఉంది.