హెరాల్డ్ విజేత : మనకాలపు మహోన్నతుడు డాక్టర్ బాబ్జి
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోనే ఒక ఆసుపత్రిని నిర్వహిస్తూ, లాభాపేక్ష లేకుండా నడుపుతూ ఉండడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. గాంధీజీ సిద్ధాంతాలు, అబ్ధుల్ కలాం ఆలోచనలతో యువతకు కావాల్సినంత ఉత్తేజాన్ని, శక్తిని అందించగల తత్వవేత్త. పాలకొల్లు ప్రాంతంలో వేలాది మందికి అరుదైన శస్త్రచికిత్సలు చేస్తూ ఎన్నో వేల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ప్రత్యక్ష దేవుడుగా జనాలు ఆయన్ను కొలుస్తారు. పాలకొల్లులో లయన్స్ కంటి ఆసుపత్రికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే కాకుండా, గత మూడు దశాబ్ధాలగా లక్షలాది మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించగలిగారు.
ఉచిత నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తూ ఉభయగోదావరి జిల్లాల్లో పేదలకు కంటి చూపునకు సంబంధించి వైద్యం, ఆపరేషన్లు అందేలా దీర్ఘకాలికంగా సేవలు కొనసాగిస్తున్నారు. పాలకొల్లు ప్రాంతంలో అంజలి మానసిక వికలాంగుల కేంద్రానికి కొండంత అండగా నిలబడ్డారు. మానసిక వికలాంగులైన చిన్నారులకు సంరక్షణ విజయవంతమైన కేంద్రంగా మార్చగలిగారు. లయన్స్ డిస్ట్రిక్ గవర్నర్ స్థాయికి ఎదిగి అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పాలకొల్లులో సబితా మహిళా జూనియర్ కళాశాల ద్వారా విద్యార్థినులకు నాణ్యమైన విద్య ప్రమాణాలు అందిస్తున్నారు.
ఒక విజయవంతమైన సర్జన్‌గా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో టీడీపీ నుంచి పాలకొల్లు ఎమ్మెల్యేగా గెలుపొందాక కూడా ఒక వైద్య వృత్తిని కొనసాగిస్తూ, ఎన్నో ప్రాణాలు నిలబెట్టారు. ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు నిర్వహించి తనకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఫీజుని కూడా ప్రభుత్వాసుపత్రికి అందించిన అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. ఈయన సేవలను అప్పటి కాంగ్రెస్ సీఎం రాజశేఖరరెడ్డి కూడా మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 75 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ క్షణం తీరికలేని జీవితాన్ని గడుపుతూ వైద్యుడిగా అరుదైన శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు.
2019 ఎన్నికల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ స్వయంగా బాబ్జిని పార్టీలోకి ఆహ్వానించి, పాలకొల్లు సీటు కూడా ఇచ్చారు. కాకపోతే కొన్ని కొన్ని పరిణామాలు, సిట్టింగ్ ఎమ్మెల్యే బలంగా ఉండడం, సొంత పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఓటమి చెందినా, జనాల్లో మాత్రం ఆయన కు ఆదరణ తగ్గలేదు. బాబ్జి అంటే పాలకొల్లుకి ఒక బ్రాండ్ అన్నట్టుగా ఆయన జనాల్లో అంతగా ప్రభావం చూపించగలిగారు.