ఐపీఎస్.. ఐపీఎస్ అంటేనే.. ఖాకీ దర్పానికి పేరు.. ఆ యూనిఫామ్ వేసుకుంటేనే అదో హోదా.. అధికారం.. కానీ ఓ ఐపీఎస్ అధికారి.. 17 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పోలీసు శాఖలో పని చేసిన తర్వాత.. అనూహ్యంగా ఖాకీ చొక్కా వదిలేశారు.. ఓ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి పట్టుబట్టి మరీ.. ఓ ప్రత్యేకమైన పోస్టు తీసుకున్నారు. ఆ పోస్టుకు అప్పటి వరకూ ఓ ఐపీఎస్ స్థాయి అధికారి ఛైర్మన్ గా లేరు.
కానీ ఆయన సీఎంతో చర్చించి.. తన ప్రణాళిక వివరించి.. ఆ పోస్టులో వేయించుకున్నారు. ఇది జరిగి దాదాపు 9 సంవత్సరాలైంది. సాధారణంగా ఓ అఖిల భారత స్థాయి అధికారి ఓ పోస్టులో మహా ఉంటే రెండు, మూడేళ్లు. అంతే.. ఆ తర్వాత బదిలీలు సర్వసాధారణం. కానీ ఆయన మాత్రం ఇంకా అదే హోదాలో ఉన్నారు. ముఖ్యమంత్రులు మారినా.. ఆయన్ను అదే స్థానంలో ఉంచారు. ఆ అధికారి పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఆ హోదా.. గురుకులవిద్యాలయాల సంస్థ ఛైర్మన్. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండగా ఈ పదవిలో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు.
ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఛైర్మన్ గా కొనసాగుతూనే ఉన్నారు. ఒకప్పుడు తిండికి ఇబ్బంది పడే తల్లిదండ్రులు మాత్రమే గురుకులాలవైపు చూసేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ గురుకులాల్లో సీట్లు దొరకడమే కష్టమైంది. గురుకుల విద్యాలయాల వ్యవస్థను పట్టుబట్టి అంత గొప్పగా తీర్చిదిద్దారు ప్రవీణ్ కుమార్. తమ సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరెస్టు వంటి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేశారు.
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రోత్సాహంతో... వందలాది విద్యార్థులు ఐఐటీ, ట్రిఫుల్ ఐటీ, వంటి సీట్లు, టాటా ఇన్సిటిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వంటి విద్యాసంస్థల్లో సీట్లు సాధించారు. ఆత్మన్యూనతతో బాధపడే దళిత, గిరిజన పిల్లలు ఇప్పుడు ఎవరెస్టులను సైతం ఎక్కుతున్నారు. దళిత, గిరిజన పిల్లల్లో అంతులేని స్థైర్యం నింపుతూ ప్రవీణ్ కుమార్.. ఓ కొత్త తరాన్నే తయారు చేశారు. ప్రవీణ్ కుమార్ పనితీరును సీఎం కేసీఆర్ సైతం అనేక సార్లు మెచ్చుకున్నారు. ఇలాంటి నిబద్ధత కలిగిన అధికారులు ఉంటే.. రేపటి పౌరుల ఉజ్జ్వలమే. తాను విజేతగా నిలవడం కాదు.. లక్షల మంది విజేతలను తయారు చేస్తున్నారు. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 17ఏళ్లపాటు వివిధ స్థాయిల్లో పోలీసుల శాఖలో పనిచేశారు. ఆ తర్వాత ప్రత్యేక సెలవు తీసుకుని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోనూ పరిపాలన శాస్త్రంలో పీజీ చదివారు. అక్కడి నుంచి వచ్చాక అప్పటి సీఎం కిరణ్ కుమార్ తో పట్టుబట్టి మరీ గురుకుల సంస్థలకు కార్యదర్శి అయ్యారు. ఒక అఖిల భారత స్థాయి అధికారి నిజంగా మనసు పెట్టి పని చేస్తే.. ఉద్యోగాన్ని ఉద్యమంలా చేస్తే ఎంతటి సత్ఫలితాలు వస్తాయో.. నేటి తెలంగాణ గురుకుల విద్యాలయాల ఫలితాలే ఓ ఉదాహరణ.
మరింత సమాచారం తెలుసుకోండి: