విజయం మీదే : ఈ ఆలోచనా ధోరణి మీలో ఉంటే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం
మనలో చాలామంది బాగా చదవాలని పుస్తకం ముందేసుకుంటారు. కొంత సమయం తరువాత ఆలోచనలు మాత్రం ఎక్కడో విహరిస్తూ ఉంటాయి. ఏదో సాధించాలని ప్రణాళికను రూపొందించుకుంటారు. ఆ తరువాత మనసు మాత్రం ఆ ఆలోచనలను పక్కనపెట్టి మరొకటి చేస్తుంది. చాలామంది మానసికంగా కుంగిపోతూ ఉండటంతో మనసు ఇతర విషయాలపై మళ్లించి విజయం సాధించలేక పోతూ ఉంటారు.
ప్రస్తుత కాలంలో చదువులో, ఉద్యోగంలో విజయం సాధించాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. ప్రస్తుత కాలంలో యువతలో ఈ సమస్య ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. చాలామంది జీవితంలో చిన్నచిన్న సమస్యలకు సైతం భయపడుతూ ఆందోళనకు గురవుతూ ఉంటారు. చిన్నచిన్న సమస్యలకు సైతం బాధ పడుతూ సమయాన్ని వృథా చేస్తున్నారు. జీవితంలో ఏ విషయంలో అయినా సక్సెస్ సాధించాలంటే మన ఆలోచనా ధోరణి మారాలి.
ఏ విషయంలోను చిరాకు, కోపం, అసహనం ప్రదర్శించకూడదు. ఆ ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇతరులపై ఆధారపడటానికి ప్రయత్నించకూడదు. యోగా, ధ్యానం చేయడం ద్వారా ఆలోచనా ధోరణి మారుతుంది. వాటి వల్ల ప్రశాంతత చేకూరి ఆలోచనలు అదుపులో ఉంటాయి. మనం ఎల్లప్పుడూ మన లక్ష్యం గురించే ఆలోచించాలి. లక్ష్య సాధనకు కావాల్సిన లక్షణాలను అలవరచుకోవాలి.
లక్ష్య సాధనలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తూ ముందడుగులు వేయాలి. ఇతరులు మనల్ని చెడు దారుల వైపు, చెడు వ్యసనాల వైపు మళ్లించటానికి ప్రయత్నిస్తే అలాంటి వారికి దూరంగా ఉండాలి. సక్సెస్ కు షార్ట్ కట్లు ఉండవు. ఎవరైతే శ్రమిస్తారో వారికి మాత్రమే విజయం సొంతమవుతుంది. శ్రమించని వారు జీవితంలో విలువైన సమయాన్ని వృథా చేసుకుని జీవితాంతం బాధ పడాల్సి ఉంటుంది. అదృష్టంతో సక్సెస్ వరించదు. అలా సక్సెస్ వరించినా ఆ సక్సెస్ ను జీవితాంతం నిలుపుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఎవరైతే లక్ష్యం కోసం నూటికి నూరు శాతం శ్రమిస్తారో వారికి విజయం తప్పనిసరిగా సొంతమవుతుంది.