విజయం మీదే : ఆశయం గొప్పదైతే విజయానికి అదే తొలిమెట్టు

Reddy P Rajasekhar

ఏదైనా మంచిపనిని మొదలుపెట్టాలని అనుకుంటే ఆ పనిని వెంటనే మొదలుపెట్టాలి. ఆలస్యం చేయకూడదు. పనిని ఆలస్యం చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చే బదులు చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మనం ఎంచుకున్న ఆశయం గొప్పదైతే విజయానికి ఆ ఆశయమే తొలిమెట్టు అవుతుంది. జీవితంలో ఏ పనిలోనైనా సక్సెస్ సాధించాలంటే మొదట మనపై మనకు పూర్తి నమ్మకం ఉండాలి. 
 
మనపై మనకు నమ్మకంతో పాటు గొప్ప ఆశయాన్ని ఎంచుకుంటే సక్సెస్ సులభంగా సొంతమవుతుంది. సాధారణ జీవితంలో ఉన్నతాశయాలు కలిగి ఉండడమే జీవిత ధర్మం.బతికిన కొన్నేళ్లైనా బాగా బతకాలని గుర్తుంచుకోవాలి. ఆశయ శుద్ధిలేని జీవితం చుక్కాని లేని నావవంటిది. గొప్ప ఆశయంతో ముందడుగులు వేస్తే సక్సెస్ సాధించడం అసాధ్యం కాదు. ఆశయాన్ని ఎంచుకుని శ్రమిస్తే శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. 
 
మనం ఏ పనికోసమైనా ఎంత శ్రమించామో అదే స్థాయిలో ఫలితాన్ని ఆశించాలి. శ్రమకు మించి ఫలితం ఆశిస్తే నిరాశే మిగులుతుంది. మనకున్న తెలివి, జ్ఞానాన్ని ఆశయానికి తగిన విధంగా మార్చుకోవాలి. ఆశయ సాధనలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుని ఎదగాలి. ఎదురయ్యే ప్రతి అపజయాన్ని మనస్పూర్తిగా స్వీకరిస్తే విజయం సులభంగా సొంతం అవుతుంది. 
 
జీవితంలో గొప్ప ఆశయంతో పాటు సక్సెస్ సాధించాలంటే మనలో కొన్ని లక్షణాలు ఉండాలి. కోపంలో సమాధానం చెప్పకుండా.... సంతోషంలో వాగ్దానం చేయకుండా.... ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకుండా.... అవసరం లేని చోట అబద్ధం చెప్పకుండా... గెలిచినపుడు గెలుపును స్వీకరిస్తూ.... ఓడినపుడు పాఠాన్ని నేర్చుకుంటూ.... ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని మననం చేసుకుంటే సక్సెస్ తప్పక సొంతమవుతుంది. ఓటమి లేని వాడికి అనుభవం రాదని.... అనుభవం లేని వాడికి జ్ఞానం రాదని గుర్తుంచుకోవాలి. సమయం విలువను తెలుసుకొని అవసరమైన విషయాల కోసం దానిని ఉపయోగించుకుంటూ ముందడుగులు వేసిన వారు తప్పక సక్సెస్ అవుతారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: