విజయం మీదే : గెలవాలన్న తపనతో శ్రమిస్తే ఏ పనిలోనైనా సులువుగా విజయం మీ సొంతం
ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్ కు ఉన్న ప్రాధాన్యత ఇతర విషయాలకు ఉండదు. సక్సెస్ పైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మరి సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలి....? అనే ప్రశ్న చాలామందిని గందరగోళానికి గురి చేస్తూ ఉంటుంది. జీవితంలో ఫెయిల్యూర్ అనేది ప్రమాద సూచిక. మనల్ని మనం ఇప్పటికైనా మార్చుకోకపోతే మరింత ప్రమాదంలో పడతామని తెలియజేసే హెచ్చరిక. జీవితంలో ఓటమి ఎదురైనా మనం బాధ పడకూడదు.
హుందాగా ఓటమిని స్వాగతించి గెలుపు దిశగా అడుగులు వేయాలి. గెలుపు నుంచి మనం చాలా తక్కువ నేర్చుకుంటాం. కానీ ఓటమి మాత్రం మనకు అనేక విషయాలను పరిచయం చేస్తుంది. ఫెయిల్యూర్ చవిచూసిన ప్రతిసారి మరింత కష్టపడటం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతోనే ప్రయత్నాన్ని మొదలుపెడతారు. అయితే ఎంతమంది శ్రమించినా విజయం మాత్రం కొందరినే వరిస్తుంది.
గెలవాలన్న లక్ష్యంతో వచ్చినవాళ్లు, ఓడిపోతామనే భయంతో వచ్చినవాళ్లు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే సక్సెస్ సాధించాలన్న తపనతో నిత్యం శ్రమిస్తారో వాళ్లు సులభంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓడిపోయామంటే మనం మరింతగా కష్టపడాల్సి ఉందని గుర్తుంచుకోవాలి. ఓటమికి కారణమైన బద్ధకాన్ని, నిర్లిప్తతను, భయాన్ని, అభద్రతను వదిలేసి విజయం కోసం కష్టపడాలి.
ఒకసారి ఓడిపోయినంత మాత్రాన నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఓడిపోవడం తప్పు కాదు. ఓటమి నుంచి పాఠాలను నేర్చుకుని గెలుపు కోసం కష్టపడాలి. ఓటమిని యథాతథంగా స్వీకరిస్తే ఆ ధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఓటమి తర్వాత ఎవరైతే మనతో మిగిలి ఉంటారో వాళ్లే నిజమైన స్నేహితులు. ఓటమి మన ఆత్మబంధువులెవరో తెలిసేలా చేస్తుంది. గెలవాలన్న తపన తగ్గితే ఓటమికి దగ్గరైనట్లే. అందువల్ల మనం ప్రతిక్షణం సక్సెస్ కోసం కష్టపడితే విజయం తప్పక సొంతమవుతుంది.