విజయం మీదే: ఈ ఒక్క లక్షణంతో మీరే రారాజు...
కొంతమందిలో ఎప్పటి నుండో ఇమిడిపోయిన కోపం, ఆవేశం, ఈర్ష్య లాంటి గుణాలెన్నో క్షమాగుణంతో మటుమాయమైపోతాయి. ఇలా జరగడం వలన మనము మానసికంగా మరింత దృడంగా తయారవుతాము. మీకు మీ స్నేహితులతోనో లేదా కుటుంబంలోని వారితోనే లేదా బంధువులతోనో గొడవలు జరిగినప్పుడు ఏవరో ఒకరు తగ్గి మాట్లాడితేనే ఆ బంధం కలకాలం నిలిచి ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరో ఒకరికి క్షమించే లక్షణం ఉండాలి. మీరు బంధానికి నిజంగా విలువ ఇచ్చేవారైతే ఇలాంటివి మీకు అర్థమవుతాయి. ఆలా కాకుండా కొంతమంది బంధాలను కేవలం వారి వ్యక్తిగత స్వార్థానికి వాడుకుంటూ ఉంటారు. అటువంటి వారు క్షమించడం మరియు దాని యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవలసి ఉంటుంది. అప్పుడే వారికి తెలిసొస్తుంది, ఇంతకాలం మనము ఏవరితో ఎలా ప్రవర్తించామో అని, ఉదాహరణకు గతంలో మీరు ఎవరితో అయినా ఒక చిన్న విషయానికి గొడవ పడి ఉంటారు. కారణం ఏదైనా మీ మధ్య బంధం చెడిపోయి ఉంటుంది.
అదేమీరు కాస్త పెద్ద మనసు చేసుకుని వారి దగ్గరకు వెళ్లి ఆరోజు జరిగిన దానిలో నాదే తప్పు ఉంది. నన్ను క్షమించండి అని ఒక్క మాట అనండి. వారు ఎంత హ్యాపీగా ఫీలవుతారో, వెంటనే వారు కూడా లేదు నాదే తప్పు అని అనకపోతే అప్పుడు అడగండి నన్ను. క్షమించే గుణంలో అంత పవర్ ఉంది. ఎంతటి మూర్ఖుల నైనా ఎంతటి ద్వేషం ఉన్న వారినైనా ఇట్లే మార్చేస్తుంది. కాబట్టి మీరు కూడా జీవితంలో ఎవరితో అయినా వివిధ కారణాల వలన విడిపోయి ఉంటే వెంటనే వెళ్లి లేదా ఫోన్ చేసి క్షమించండి అని అడగండి. మీరు పోగొట్టుకున్న బంధాలను, బంధుత్వాలను తిరిగి తెచ్చుకోండి. మీరు ఈ క్షమాగుణం అనే లక్షణాన్ని మీలో పెంపొందించుకుంటే మీరే మీ జీవితానికి రారాజు.