జీవన ప్రయాణంలో ఎన్ని సమస్యలు ఎదురైనా అన్నిటినీ అధిగమించి ముందుకు సాగితేనే విజయం అందుతుందని అనుభవజ్ఞులు చెబుతుంటారు. కానీ ఈ మాట విన్న చాలా మంది ఏమనుకుంటారంటే...కష్టం అనుభవించే వారికే తెలుస్తుంది, ఉచిత సలహాలు ఇచ్చేవారికి కాదు అని వాపోతుంటారు, అయితే కష్టపడితే ప్రతిఫలం తప్పక దక్కుతుంది, దైర్యంతో ముందుకు సాగితేనే విజయం అందుతోంది అన్నవి ఒట్టి మాటలు కావు. ఎందరో తమ జీవితాల్లో స్వయంగా తెలుసుకున్న సత్యాలు. అయితే ఇప్పుడు అందుకు సంబంధించిన ఒక నిజ జీవిత కథను గూర్చి తెలుసుకుందాం. తద్వారా అసలు విషయాన్ని అర్దం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక కుర్రాడికి.. సినిమాలంటే ఎంతో ప్రీతి, అంతకుమించిన ఆసక్తి. ఫిల్మ్ మేకింగ్ చేయాలన్నది అతడి కల. అందుకు శిక్షణ కొరకు ఫిల్మ్ స్కూళ్ళో చేర్పించమని వాళ్ళ నాన్న ను పదే పదే అడిగేవాడు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ పై పెద్దగా ఆసక్తి లేని వాళ్ళ నాన్న.. ఇండస్ట్రీ కరెక్ట్ చాయిస్ కాదని నచ్చచెప్పి అతడి కోరికను తిరస్కరించాడు.
కానీ డైరెక్టర్ కావాలనే అతడి సంకల్పం అవన్నీ లెక్కచేయలేదు. కనీసం తండ్రికి కూడా చెప్పకుండా ఫిలిం స్కూల్లో చేరి శిక్షణ పూర్తి చేశాడు. అతడి తండ్రి మాత్రం అప్పటి నుండి కొడుకు ముఖమైనా చూడలేదు. ఫిల్మ్ స్కూల్ లో శిక్షణ పొందిన ఆ కుర్రాడు ఇక నేను యాక్షన్ అని చెప్పడానికి రెడీ అంటూ వైవిధ్య భరిత స్క్రిప్ట్ లను రెడీ చేసుకుని కాళ్ళు అరిగేలా నిర్మాణ సంస్థల చుట్టూ అవకాశం కోసం తిరిగాడు. సంవత్సరాలు గడిచాయి ఆ కుర్రాడి వయసు 30 దాటుతోంది. ఆ సమయంలో తన క్లాస్ మేట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఒక ప్రయోగశాలలో పనిచేస్తుంది. ఆ కుర్రాడు ఎక్కని ఆఫీస్ మెట్టు లేదు అడగని నిర్మాత లేడు. అయినా ఛాన్స్ లభించలేదు. వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. బాధ్యతలు పెరిగాయి, తన కలను విడిచి పెట్టి కుటుంబం కోసం ఆర్థికంగా సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుని కంప్యూటర్ టీచర్ గా చేరాడు. జాబ్ అయితే చేస్తున్నాడు కానీ అతడి మనసు మొత్తం సినిమాపైనే ఉంది.
అది గమించిన భార్య దర్శకుడు అవ్వాలన్నది మీ లక్ష్యం. అలాంటప్పుడు అది ఒకటి రెండు సార్లు ఫలితం లేదు కదా అని పూర్తిగా మీ ఆశయాన్ని వదిలేస్తారా? అంటూ అతడిని మీరు అనుకున్నది సాధించగలరు అని ప్రోత్సహించింది. అతడిలో ఆసక్తి, సాధించాలనే తపన మరింత పెరిగింది. మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు. చివరికి ఛాన్స్ అందుకున్నాడు. చైనీస్ మార్షల్ ఆర్ట్స్ సంబందించి ఒక సినిమా తీసే అవకాశం దక్కింది. అంతేకాదు ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యింది. దీని వల్ల మనం గ్రహించాల్సింది ఏమిటంటే విజయం వెంటనే రాకపోవచ్చు కానీ, పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పక వరిస్తుంది. కానీ ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం కొనసాగించడం ముఖ్యం. ఈ కథ వలన మీలో కూడా మార్పు రావాలని ఆశిస్తున్నాము.