ప్రపంచంలో అత్యధిక వయసు కలిగిన బామ్మ మృతి చెందారు. ఆమె వందేళ్లకు పైగా డాక్టర్‌ను చూడ లేదంటే నమ్ముతారా.. అది పచ్చి నిజం నమ్మండి. ప్రపంచంలోనే అతి పెద్ద వయస్సు కలిగిన వ్యక్తిగా భావిస్తున్న రష్యా మహిళ టాంజిలియా బిసెంబెయేవా 124 సంవత్సరాల వయసులో దక్షిణ రష్యాలోని తన స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. బిసెంబెయేవా మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేశారని డైలీ మెయిల్ పేర్కొంది.
ఆమె ప్రశాంతంగా కన్నుమూశారని, కుటుంబ మెమోరియల్‌లో ఆమెను ఖననం చేశారని అధికారులు తెలిపారు. ఆమె అంతిమయాత్రను వీక్షించేందుకు గ్రామం మొత్తం తరలివచ్చిందని చెప్పారు. టాంజిలియా బిసెంబెయేవా 1896 మార్చి 14న జన్మించినట్టు చెబుతున్నారు. ఆమెకు నలుగురు పిల్లలు కాగా, పది మంది మనుమలు, 13 మంది మునిమనుమలు, మరో ఇద్దరు మునిమనుమల కుమారులున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆమె ఎప్పుడూ కుదురగా కూర్చోదని, ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటారని అదే ఆమె దీర్ఘాయుష్షుకు కారణమని చెప్పుకొచ్చారు. ఆమె పులియబెట్టిన పాలు ఎక్కువగా తీసుకునేవారని వెల్లడించారు. ఆమె తొలిసారిగా వైద్యుడ్ని సంప్రదించినప్పుడే ఆమెకు వందేళ్లు పైబడ్డాయని స్ధానికులు చెప్పారు. కాగా, 2016లో టాంజిలియా బిసెంబెయేవా 120 సంవత్సరాల వయసుతో ప్రపంచంలోనే జీవిస్తున్న అతిపెద్ద వయస్కురాలిగా అధికారికంగా గుర్తించినట్టు రష్యన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది.